Begin typing your search above and press return to search.

వీళ్లకు కావాలి వాళ్లకు అవసరం లేదు?

By:  Tupaki Desk   |   18 April 2019 4:52 AM GMT
వీళ్లకు కావాలి వాళ్లకు అవసరం లేదు?
X
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో ఒక సినిమా జనానికి చేరాలంటే ప్రమోషన్లు చాలా కీలకం. హీరో పెద్దవాడా చిన్న వాడా అనే పాయింట్ అనవసరం. పబ్లిసిటీ లేనిదే వంద కోట్లు పెట్టి తీసిన సినిమాను కూడా ఎవరూ పట్టించుకోరు. అందులో భాగంగా చేసేవే ప్రెస్ మీట్లు-ప్రీ రిలీజ్ ఈవెంట్లు-హోర్డింగులు-టీవీ యాడ్లు-బస్సులపై బ్యానర్లు ఒకటా రెండా ఇవన్నీ పబ్లిక్ ని ఆకర్షించి మన సినిమా వైపు చూసేలా చేసి థియేటర్ దాకా రప్పించే ప్రయత్నం చేయడమే.

అందుకే తారలు సైతం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతూ ఉంటారు. అయితే దీన్ని ఆవిరిగారుస్తూ ఉంటారు కొందరు పిఆర్ ఓలు. సాధారణంగా ఇలాంటి పిఆర్ ఓల కనుసన్నల్లోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జరుగుతూ ఉంటాయి. ఇందులో రెండు రకాల పిఆర్ ఓలు ఉంటారు

సినిమాను బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తూ పెద్దగా ఆసక్తి చూపని ఆర్టిస్టుల వెంటపడి వాళ్ళను తీసుకొచ్చి మరీ ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ నాలుగు టికెట్లు ఎక్కువ తెగేలా చేసేవాళ్ళు ఒకరకం. అసలు సినిమాలో ఉన్న ఆర్టిస్టులను దాచేసి మీడియా కంటపడనివ్వకుండా తారలకు లేని హైప్ ని తీసుకొచ్చి ప్రమోషన్లకు దూరం పెట్టే పిఆర్ ఓలు మరోరకం. రేపు విడుదల కాబోతున్న నాని జెర్సీ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది.

చిన్న మీడియా సంస్థల మాట దేవుడెరుగు పేరు మోసిన మీడియా కంపెనీలకు సైతం ఇంటర్వ్యూలు ఇవ్వకుండా టైం లేదంటూ తప్పుకోవడమే కాక టైం ఇప్పించమని సదరు పిఆర్ ఓని అడిగితే హీరోగారు ఒప్పుకోరు అంటూ మాట దాటేయడం మాములు అయిపోయింది. బాలీవుడ్ లో దీనికి భిన్నంగా చిన్నా పెద్ద తేడా లేకుండా మీడియాతో కలివిడిగా తిరిగే స్టార్ క్యాస్ట్ ని చూడొచ్చు. కానీ మన దగ్గర మాత్రం ఆ పరిస్థితి లేదు.

ఇది ఎవరి పొరపాటైనా కావొచ్చు కానీ చివరికి నష్టపోయేది సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ తో పాటు కొన్న డిస్ట్రిబ్యూటర్లు. ఇకనైనా వాస్తవాలు గుర్తించి తమచుట్టూ అనవసరపు కోటలా కమ్ముకున్న ఈ హంగామా నుంచి తారలు బయటికి వచ్చి మీడియాకు అందుబాటులో ఉంటారేమో చూడాలి. అదే జరిగితే సినిమా నాలుగు రోజులు ఎక్కువ ఆడేవి అవకాశం దక్కుతుంది. లేదూ అంటే మంచి సినిమా నలుగురికి చేరకుండానే థియేటర్ల నుంచి సెలవు తీసుకుంటుంది