Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ బ్యాన‌ర్ స‌త్తా ఎంతో తేలాలంటే..?

By:  Tupaki Desk   |   13 July 2021 5:00 AM IST
కేజీఎఫ్ బ్యాన‌ర్ స‌త్తా ఎంతో తేలాలంటే..?
X
కేజీఎఫ్ సంచ‌ల‌నాల‌తో హోంబ‌లే ఫిల్మ్స్ పేరు జాతీయ స్థాయిలో మ‌ర్మోగిన సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ‌లో అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా ఇత‌ర ప్ర‌పంచానికి తెలిసొచ్చింది. ఆరంభం అగ్ర హీరో పునీత్ రాజ్ కుమార్ తో నిన్నింద‌లే- రాజ‌కుమార లాంటి చిత్రాల్ని నిర్మించిన హోంబ‌లే సంస్థ నాలుగో చిత్రంగా కేజీఎఫ్ చాప్ట‌ర్ 1ని తెర‌కెక్కించింది. కేజీఎఫ్ అనూహ్య విజ‌యాన్ని సాధించ‌డంతో హోంబ‌లే ఫిల్మ్స్ కి పాన్ ఇండియా లెవ‌ల్లో పాపులారిటీ ద‌క్కింది. ఆరంభ‌మే అత్యంత‌ భారీ బ‌డ్టెట్.. రాజీలేని నిర్మాణంతో స‌త్తా చాట‌డంతో ఇండ‌స్ట్రీ అన్నిచోట్లా ఈ బ్యాన‌ర్ గురించి చ‌ర్చించుకోవడం మొద‌లైంది.

ప్ర‌స్తుతం `కేజీఎఫ్-2` చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కించింది. బ‌హుభాష‌ల్లో రిలీజ్ చేయ‌డానికి హోంబ‌లే సంస్థ‌ స‌న్న‌ద్ధం అవుతుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధిస్తే..సంస్థ గుర్తింపు ప‌దింత‌ల‌వుతుందని అంచ‌నా. కేజీఎఫ్ -2 కి 100 కోట్ల‌కు పైగా వ్య‌యం చేస్తుండ‌గా.. 500 కోట్ల వ‌సూళ్ల టార్గెట్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతోంది. తెలుగు-త‌మిళం-క‌న్న‌డం -హిందీ - మ‌ల‌యాళంలో పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ అవుతున్న సినిమా కాబ‌ట్టి వ‌సూళ్లు కూడా అదే స్థాయిలో సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు నిర్మాణ సంస్థ త‌మ ఐడెంటిటీని ఎంత మాత్రం చెక్కు చెద‌ర‌కుండా భ‌విష్య‌త్ లో కూడా భారీ బ‌డ్జెట్ చిత్రాల‌నే నిర్మించ‌డానికి రెడీ అవుతోంది. స్టార్ హీరోల‌తో క్రేజీ సినిమాలు నిర్మించ‌డానికి రంగం సిద్దం చేస్తోంది. అయితే ఈ ప్ర‌ణాళిక‌ల‌న్నీ స‌జావుగా సాగాలంటే `కేజీఎఫ్‌2` ఫ‌లితం కీల‌కం కానుదన్న‌ది ఒక‌ వాద‌న‌. ఫ‌లితాలు ఆశించిన విధంగా వ‌స్తే త‌దుప‌రి సినిమాల బ‌డ్జెట్లు అంత‌కంత‌కు పెరిగే వీలుంటుంది. లేక రిజ‌ల్ట్ మ‌రోలా ఉంటే నిర్మాణం స్పీడ్ త‌గ్గే ఛాన్స్ లేక‌పోలేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక హోంబ‌లే సంస్థ ఇప్ప‌టికిప్పుడు నాలుగు సినిమాల్ని నిర్మిస్తోంది. ఇందులో డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `స‌లార్` పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి హోంబ‌లే సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ ని వెచ్చిస్తోంది. ఇక ఈ చిత్రంలో సాహో.. కేజీఎఫ్ ల‌ను మించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో మ‌రో హిస్ట‌రీ సృష్టించాల‌ని స‌ద‌రు సంస్థ బ‌డ్జెట్ల‌ను కేటాయిస్తోంద‌ని స‌మాచారం. సౌత్ తో పాటు హిందీ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని కంటెంట్ ప‌రంగా ఈసారి మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు ప్ర‌శాంత్ నీల్. స‌లార్ మూవీలో యాక్ష‌న్ పార్ట్ కానీ.. ఛేజింగ్ స‌న్నివేశాలు కానీ మ‌రో లెవ‌ల్లో హోంబ‌లే తో క‌లిసి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బైక్ ఛేజ్ లు కార్ ఛేజ్ లు మ‌రో లెవ‌ల్లో ఉంటాయ‌న్న టాక్ వినిపిస్తోంది.

స‌లార్ త‌ర్వాత భ‌గీర‌- రిచ‌ర్డ్ ఆంటోని -ద్విత్వ‌ వంటి చిత్రాల్ని హోంబ‌లే సంస్థ‌ నిర్మిస్తోంది. భ‌గీర చిత్రానికి కేజీఎఫ్ ఫేం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. రిచ‌ర్డ్ ఆంటోని మూవీ ర‌క్షిత్ శెట్టి హీరోగా స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. వీట‌న్నిటి కోసం హోంబ‌లే సంస్థ భారీ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూరుస్తోంది. ద్విత్వ కోసం మ‌రోసారి పునీత్ రాజ్ కుమార్ ని స‌ద‌రు సంస్థ బరిలోకి దించుతోంది.