Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి పాఠం నేర్పిస్తున్న కోలీవుడ్!

By:  Tupaki Desk   |   27 April 2020 11:45 AM IST
టాలీవుడ్ కి పాఠం నేర్పిస్తున్న కోలీవుడ్!
X
క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. మాల్స్- థియేట‌ర్స్ సెక్ష‌న్ ఎప్ప‌టికి తెరుచుకుంటాయో క్లారిటీ లేని ప‌రిస్థితి. కొవిడ్ 19 మ‌హ‌మ్మారీకి వ్యాక్సిన్ క‌నుగొనేంత వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. మ‌హమ్మారీ రోజురోజుకు విస్త‌రిస్తుంటే అంద‌రిలో ఒక‌టే భ‌యాందోళ‌న నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే ఈ ప్ర‌మాదం నుంచి ప్ర‌పంచ దేశాలు బ‌య‌ట‌ప‌డేందుకు కొన్ని నెల‌ల‌పాటు లేదా ఏడాది పైగానే వేచి చూడాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.

అయితే స‌రైన టైమ్ లో స‌రైన విశ్లేష‌ణ చేసుకుని ఒక నిర్ణ‌యం తీసుకోక‌పోతే ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసుకుని రిలీజ్ ల కోసం వేచి చూస్తున్న నిర్మాత‌ల పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌ని అంచనా వేస్తున్నారు. అస‌లుకే మోసం రాకుండా డిజిట‌ల్ రిలీజ్ ద్వారా వ‌చ్చేది రాబ‌ట్టుకోవ‌డ‌మే మేల‌న్న వాద‌నా వినిపిస్తోంది.
అయితే కొంద‌రు టాలీవుడ్ హీరోలు డిజిట‌ల్ రిలీజ్ కి స‌సేమిరా అంటున్నార‌న్న ప్ర‌చారం ఇటీవ‌ల సాగుతోంది. అలాగే అగ్ర హీరోల సినిమాలు సైతం రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా .. ఇంకా థియేట్రిక‌ల్ రిలీజ్ ల కోసం వేచి చూస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇంకా ఎన్నాళ్లు ఈ వెయిటింగ్? ఇరుగు పొరుగు భాష‌ల హీరోల్ని.. నిర్మాత‌ల్ని చూసి నేర్చుకోరా? అన్న వాద‌నా తాజాగా తెర‌పైకి వ‌చ్చింది.

దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీల‌న్నీ దారుణ స‌న్నివేశంలో ఉన్నాయి. ఇలాంట‌ప్పుడు బ‌తుకు జీవుడా అంటూ రాబ‌ట్టుకోవాల్సింది రాబ‌ట్ట‌క‌పోతే ఇక‌పై క‌ష్ట‌మేన‌న్న విశ్లేష‌ణ చేస్తున్నారు. ఐదు వారాలుగా సినిమాలు రిలీజ్ లు లేకుండా ఆగిపోయాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లను తిరిగి ఓపెన్ చేస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్ప‌ట్లో ఆ స‌న్నివేశ‌మే క‌నిపించ‌డం లేదు కాబట్టి.. చిన్న మరియు మధ్యస్థ బడ్జెట్ సినిమాల నిర్మాతలు OTT వేదిక‌పై విడుదలకు చేసేసుకోవాల‌న్న ఆలోచ‌న మొద‌లైంది. కానీ కొంద‌రు టాలీవుడ్ హీరోలు మాత్రం దీనికి అంగీక‌రించ‌లేద‌ని ఇటీవ‌ల ముచ్చ‌ట సాగుతోంది. అయితే ఎలాంటి అవాంత‌రం వ‌చ్చినా త‌న సినిమాని ఆప‌కుండా రిలీజ్ చేసేస్తాన‌ని 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్య కోలీవుడ్ లో ప్ర‌క‌టించడం సంచ‌ల‌న‌మైంది. ఆయ‌న నిర్మించిన‌ తమిళ చిత్రం `పొన్‌మగల్ వంధల్` అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. జ్యోతిక నటించిన ఈ చిత్రం మార్చి 27 న థియేటర్లలోకి రావాల్సి ఉండ‌గా అది సాధ్య‌ప‌డ‌లేదు. థియ‌ట‌ర్ య‌జ‌మానులు కుదర‌ద‌ని వ్య‌తిరేకిస్తున్నా దానిని సూర్య లైట్ తీస్కున్నాడు. ఇక సూర్య బాట‌లోనే విజ‌య్ వెళ్ల‌నున్నాడు. అత‌డు న‌టించిన‌ మాస్ట‌ర్ డిజిట‌ల్ రిలీజ్ కానుంద‌ట‌. మ‌రో 30 మంది ప్రముఖ కోలీవుడ్ నిర్మాతలు ముందుకు వచ్చి డిజిట‌ల్ రిలీజ్ ల‌పై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చిన్న-మధ్యస్థ బడ్జెట్ చిత్రాల డిజిటల్ విడుదలకు తమిళనాడు చలన చిత్ర నిర్మాతల మండలి ఏకగ్రీవంగా మద్దతును ప్ర‌క‌టించింది. భారతి రాజా- జ్ఞానవేల్ రాజా- లైకా అధినేత‌ కుమారన్- టి శివ- కె రాజన్ స‌హా ప‌లువురు అగ్ర‌ నిర్మాతలు OTT విడుదలకు త‌మ అంగీకారం తెలిపారు. ఇక చిన్న .. మధ్యస్థ చిత్రాల్ని డిజిట‌ల్లో విడుదల చేస్తే.. థియేట్రికల్ విడుదల కోసం వేచి ఉన్న చిత్రాల సంఖ్య తగ్గుతుంది. బ్యాలెన్స్ సినిమాలు కూడా సరిగ్గా విడుదల చేసుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని వీరంతా అంగీక‌రించారు.

అంతేకాదు.. డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టే నిర్మాత‌కు ఏ విధానంలో అయినా రిలీజ్ చేసుకునే హ‌క్కు ఉంటుంద‌ని అక్క‌డ ప్ర‌క‌టించారు. అందుకు వేరొక‌రు అభ్యంత‌రం చెప్పినా కుద‌ర‌ద‌న్న వాద‌నను తెర‌పైకి తెచ్చారు. అయితే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవ‌ద్ద‌ని త‌మిళ‌ నిర్మాతల మండ‌లి వివిధ శాఖ‌ల‌కు విజ్ఞప్తి చేసింది. థియేట‌ర్ యాజ‌మ‌న్యాల‌కు నిర్మాత‌ల గోడును వివ‌రించి చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. అయితే త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ఈ ప‌రిణామం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌పైనా ప్ర‌భావం చూపుతుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. హీరోలు.. థియేట‌ర్ యజ‌మానుల హుంక‌రింపు ల‌తో ప‌ని లేకుండా నిర్మాత న‌ష్ట‌పోకుండా మండలి చ‌ర్య‌లు తీసుకునే వీలుంద‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఇక ఇన్నాళ్లు థియేట్రిక‌ల్ రిలీజ్ అంటూ వేచి చూసిన టాలీవుడ్ హీరోలు.. నిర్మాత‌లు సైతం కోలీవుడ్ ప‌రిణామాల్ని గ‌మ‌నించాక మార‌తార‌నే భావిస్తున్నారు. తెలుగులో చిన్న‌ సినిమాల్ని ఇక డిజిట‌ల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నార‌న్న వార్త‌ల న‌డుమ పెద్ద సినిమాలు సైతం ఇదే దారిలో వెళ్లేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు.