Begin typing your search above and press return to search.

బెనిఫిట్ షోల కోసం తీవ్రంగా ప్రయత్నాలు!

By:  Tupaki Desk   |   4 Jan 2019 5:40 AM GMT
బెనిఫిట్ షోల కోసం తీవ్రంగా ప్రయత్నాలు!
X
స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో సందడి ఉంటుంది. ఇక ఫ్యాన్స్ సంగతి అసలు చెప్పనవసరం లేదు. ఎలాగైనా తమ అభిమాన నటుడి సినిమాను మొదటి షోనే చూడాలనుకుంటారు. అందుకే బెనిఫిట్ షోల పేరుతో సినిమా రిలీజ్ కు ముందు రోజు రాత్రే స్క్రీనింగ్ జరుగుతుంది. టికెట్ల రేట్లు కూడా భారీగానే ఉంటాయి. వెయ్యి రూపాయలనుండి మొదలయ్యే టికెట్ ఒక్కోసారి క్రేజును బట్టి మూడు నాలుగు వేలు కూడా పలుకుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ ఈ బెనిఫిట్ షోల సంప్రదాయం కొనసాగుతోంది గానీ తెలంగాణా రాష్ట్రంలో రెండేళ్ళ క్రితం ఈ ట్రెండ్ కు చెక్ పెట్టారు. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రభుత్వానికి ఈ పర్మిషన్ల వచ్చే ఆదాయం నామమాత్రం కావడం ఒక కారణం అయితే.. అర్థరాత్రి థియేటర్ల వద్ద సెక్యూరిటీ కల్పించాల్సి రావడం దీనికి మరో కారణం. వీటికి తోడు బెనిఫిట్ షోల పేరుతో జరిగే దోపిడీకి చెక్ పెట్టడం అనేది మరో ఆలోచన.

గత రెండేళ్ళ నుండి చాలామంది హైదరాబాద్ లో బెనిఫిట్ షోలకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మరో వారం రోజుల్లో సంక్రాంతి సీజన్ సినిమాలు విడుదల కానుండడంతో మళ్ళీ బెనిఫిట్ షోల అనుమతులకోసం గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. పలు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు.. కొంతమంది పీఆర్వోలు ఈ ప్రయత్నాలలో ఉన్నారట. అటు కేటీఆర్ ను ఇటు పోలీసు బాసులను ఒప్పించేందుకు వీళ్ళందరూ ట్రై చేస్తున్నారట. మరి ఈ ప్రయత్నాలు ఫలించేనా లేదా అనేది మరో నాలుగు రోజుల్లో మనకు తెలిసిపోతుంది.