Begin typing your search above and press return to search.

లవ్‌ స్టోరీకి శాపంగా మారిన 'ఏపీ' రూల్స్‌

By:  Tupaki Desk   |   8 Sep 2021 5:03 AM GMT
లవ్‌ స్టోరీకి శాపంగా మారిన ఏపీ రూల్స్‌
X
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా లవ్‌ స్టోరీ విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీలను పలు సార్లు మార్చడం జరిగింది. మొన్నటికి మొన్న ఈనెల 10వ తారీకున సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాని వారం కూడా తిరక్కుండానే సినిమా విడుదల తేదీ విషయంలో వెనక్కు తగ్గుతున్నట్లుగా ప్రకటించారు. లవ్‌ స్టోరీ కి మంచి బజ్ ఉంది. అందుకే కరెస్ట్‌ సమయంలో విడుదల చేస్తే మంచి వసూళ్లు రావడం ఖాయం. కాని లవ్‌ స్టోరీకి మాత్రం మంచి సమయం దొరకడం లేదు. లవ్‌ స్టోరీ విడుదల తేదీ విషయంలో నిర్మాతలు మరియు దర్శకుడు ఒక నిర్ణయానికి రాకపోవడానికి కారణం ఏపీలో ఉన్న పరిస్థితులు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏపీలో కరోనా కారణంగా ఇంకా ఆంక్షలు ఉన్నాయి. రాత్రి సమయంలో కర్ఫ్యూతో పాటు థియేటర్ల నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు లేవు. దాంతో పాటు థియేటర్ల టికెట్ల రేట్ల విషయంలో కూడా అసంతృప్తి ఉంది. తెలంగాణలో థియేటర్లలో రేట్లతో పోల్చితే ఏపీలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అతి త్వరలోనే జగన్‌ ప్రభుత్వం నుండి టికెట్ల రేట్ల పెంపుకు అనుమతులు వస్తాయని అంతా ఆశిస్తున్నారు. కాని అదుగో ఇదుగో అంటూ ఆ విషయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. పెద్ద ఎత్తున లవ్‌ స్టోరీ ని అక్కడ విడుదల చేసినా కూడా మూడు షో లతోనే నడపాల్సి ఉంటుంది.. అంతే కాకుండా తక్కువ టికెట్ల రేట్లతో సినిమా ప్రదర్శించాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే చాలా నష్టం లవ్ స్టోరీకి తప్పదు. అందుకే సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. లవ్ స్టోరీ విడుదల కావాలంటే ఏపీలో ఉన్న లాక్ డౌన్ మరియు టికెట్ల రేట్ల రూల్స్ మారాల్సి ఉంది.

ఇప్పుడు కొత్తగా ఏపీలో వినాయక చవితి ఉత్సవాల పై కూడా ఆంక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో సినిమాను విడుదల చేయడం అంటే లాభాలను ఆశించడం కష్టం. అందుకే అక్కడ విడుదల చేసేందుకు మేకర్స్ కాని బయ్యర్లు కాని ఆసక్తి చూపడం లేదట. అందుకే లవ్‌ స్టోరీ సినిమా ను అక్కడి పరిస్థితులు పూర్తిగా కుదట పడ్డ తర్వాత.. నార్మల్ అయ్యాక మాత్రమే విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిదా తర్వాత శేఖర్‌ కమ్ముల మరియు సాయి పల్లవిల కాంబోలో వస్తున్న సినిమా అవ్వడం వల్ల లవ్ స్టోరీని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఎప్పటికి లవ్‌ స్టోరీ వస్తుందో చూడాలి.