Begin typing your search above and press return to search.

ఫైనాన్షియ‌ర్స్ ‌కి నిర్మాత‌ల గిల్డ్ చెక్?

By:  Tupaki Desk   |   16 Jun 2020 6:30 AM
ఫైనాన్షియ‌ర్స్ ‌కి నిర్మాత‌ల గిల్డ్ చెక్?
X
మ‌హ‌మ్మారీ కాలంలో అప్పులు తెచ్చిన వాటికి వ‌డ్డీలు క‌ట్టాలా వ‌ద్దా? సామాన్య ఉద్యోగుల ఈఎంఐల‌కు మార‌టోరియం పేరుతో బ్యాంకులు భ‌రోసా క‌ల్పించాయి. ఆ త‌ర్వాత ఈఎంఐలు తీరిగ్గా క‌ట్టుకోండి! అంటూ కొంత ఉప‌శ‌మ‌నం అయినా క‌ల్పించాయి. అలాంట‌ప్పుడు టాలీవుడ్ నిర్మాత‌ల అప్పుల‌పై వ‌డ్డీలు క‌ట్టేందుకు ఏదైనా ప్రాతిప‌దిక ఉందా? అస‌లు ఫైనాన్స్ లు ఇచ్చిన ఫైనాన్షియ‌ర్ల ఉద్ధేశం ఎలా ఉంది? అంటే .. వీట‌న్నిటికీ చాలానే చిక్కుముడులు ఉన్నాయ‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.

ప్ర‌స్తుతం అప్పులు తెచ్చిన నిర్మాత‌ల పాలిట వ‌డ్డీలు గుదిబండ‌గా మారాయి. ఆన్ సెట్స్ ఉన్న చాలా సినిమాలు స‌వ్యంగా రిలీజ‌వుతాయా లేదా? థియేట్రిక‌ల్ రిలీజ్ ఉంటుందా లేదా? అన్న టెన్ష‌న్ అలానే ఉంది. మ‌హ‌మ్మారీకి వ్యాక్సిన్ వ‌స్తే కానీ పెద్ద తెర‌పై రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మేన‌న్న వాద‌నా ఉంది. ఇలాంట‌ప్పుడు తెచ్చిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టాలా వ‌ద్దా? అన్న టెన్షన్ లో నిర్మాత‌లు న‌లిగిపోతున్నారు. మ‌రి ఇలాంటి వాటికి నిర్మాత‌ల గిల్డ్ ప‌రిష్కారం ఏమిటి? ఎలానూ నిర్మాతల మండ‌లి ప‌ట్టించుకునే స్థితిలో లేదు కాబ‌ట్టి గిల్డ్ వాళ్లు అయినా ప‌రిష్కారం చూపిస్తారా? అంటే దానికి కొన్ని లీకులు అందాయి.

వ‌డ్డీలు క‌ట్టే అంశంపై నిర్మాత‌ల గిల్డ్ స‌యోధ్య కుదిర్చే ప‌నిలో ప‌డింద‌ట‌. నిర్మాత‌ల‌ను.. ఫైనాన్షియ‌ర్ల‌ను ఒక చోట కూచోబెట్టి మాట్లాడించాల‌ని చూస్తోంద‌ట‌. అయితే ఫైనాన్షియ‌ర్లు మాత్రం వ‌డ్డీల్ని అణా పైసా స‌హా ముక్కు పిండి వ‌సూలు చేయాల‌న్న పంతంతో ఉన్నారు. కానీ నిర్మాత‌ల ప‌రిస్థితి అలా లేదు. ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు గిల్డ్ వాళ్లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం పెండింగ్ లో ప‌డిన ప్రాజెక్టుల్ని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు ఫైనాన్షియ‌ల‌ర్లే ఆదుకోవాల‌ని శ‌ర‌తులు పెడుతోంద‌ట‌. త్వ‌ర‌గా సినిమాల్ని పూర్తి చేయించి రిలీజ్ చేస్తే కొంత ఉప‌శ‌మ‌నం ద‌క్కుతుంద‌ని గిల్డ్ సాయ‌ప‌డే ఆలోచ‌న చేసింది. అయితే ఇది ఎప్ప‌టికి ప‌రిష్కారం అవుతుంది? అన్న‌ది చూడాలి.

షూటింగుల‌కు అన్ని వైపుల నుంచి అనుమ‌తులు వ‌చ్చేశాయి కాబ‌ట్టి ఇక సెట్స్ కెళ్లాల్సిన త‌రుణంలో చాలా మందికి వ‌డ్డీకి అప్పు కావాలి. కానీ ఇచ్చేందుకు మాత్రం ఫైనాన్షియ‌ర్లు ఎవ‌రూ సిద్ధంగా లేక‌పోవ‌డం నానా తిప్ప‌లు తెచ్చి పెడుతోంది. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఎలా? అని బుర్ర‌లు ప‌ట్టుకుంటున్నార‌ట గిల్డ్ వాళ్లు. రెండు మూడు నెల‌లుగా వ‌డ్డీలు క‌ట్ట‌కుండా బ‌కాయిలు ప‌డిపోయాయి. వాటిని క్లియ‌ర్ చేస్తేనే ఫైనాన్స్ ఇస్తామ‌ని వ్యాపారులు అనేస్తున్నార‌ట‌. లేదా ఆ రెండు మూడు నెల‌ల బ‌కాయి వ‌డ్డీల‌కు గిల్డ్ వాళ్లు ఏదైనా ఫైనాన్షియ‌ర్స్ కి హామీ పూచీ ప‌త్రాలు రాయిస్తే మాత్రం అప్పు పుట్టే వీలుంద‌ని భావిస్తున్నారు.