Begin typing your search above and press return to search.

ఆ రెండు గంట‌లు జీవితంలో మ‌రువ‌లేను

By:  Tupaki Desk   |   7 July 2019 11:24 AM IST
ఆ రెండు గంట‌లు జీవితంలో మ‌రువ‌లేను
X
ఇంట‌ర్నెట్ ప్రాబ‌ల్యం లేని రోజుల్లోనే ఆన్ లైన్ లో మెగా స్టార్ రికార్డుల్ని అప్ లోడ్ చేస్తూ మెగాభిమానిగా పాపుల‌ర‌య్యాడు. దేశ విదేశాల్లో మెగా ఫ్యాన్స్ ని ఓ గొడుగు కిందికి తెచ్చేందుకు బ‌న్నితో క‌లిసి శ్ర‌మించాడు. కాల‌క్ర‌మంలో అదే మెగా ఫ్యాన్ డిస్ట్రిబ్యూట‌ర్ గా.. స‌హ‌నిర్మాత‌గా.. నిర్మాత‌గా ఎదిగాడు. ఇదంతా ఎవ‌రి గురించి అంటే బ‌న్నికి స‌న్నిహితుడైన ఎస్‌.కె.ఎన్ గురించే. అల్లు అర్జున్ పీఆర్ వోగా ప‌ని చేస్తూనే దేవ‌ర‌కొండ హీరోగా ట్యాక్సీవాలా సినిమాని నిర్మించి స‌క్సెస్ ద‌క్కించుకున్నాడు ఎస్‌.కె.ఎన్‌. నేడు బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న లైఫ్ జ‌ర్నీ గురించి మీడియాతో ముచ్చ‌టించారు.

మెగాస్టార్ అభిమానిగా 18 సంవత్సరాల క్రితం మెగా ఫ్యాన్స్‌ క్లబ్‌ రన్ చేశాను. ఆన్‌ లైన్‌ లో చిరంజీవిగారి సినిమా రికార్డ్‌ లు అప్‌ డేట్ చేస్తూ వ‌ర‌ల్డ్ ఫ్యాన్స్ కి చేరువ‌య్యాను. ఏలూరులో పెద్ద సినిమాలు వేకువ‌ఝాము 3 గం.ల‌కే లేచి చూసేవాడిని. వాటి రిపోర్ట్ ని వెబ్ లో అప్ లోడ్ చేసేవాడిని. అలా అల్లు శిరీష్.. చిరంజీవి గారి స్నేహితులు కోనేరు కుమార్ ప‌రిచ‌యం అవ్వ‌డం.. అటుపై విజ‌య‌వాడ‌లో ఇంద్ర వేడుక స‌మ‌యంలో శిరీష్ న‌న్ను బ‌న్నికి ప‌రిచ‌యం చేయ‌డం.. ఇద్ద‌రం క‌లిసి చిరంజీవి గారి యాక్టివిటీస్ లో పాలు పంచుకుని ఇంత‌వ‌ర‌కూ వ‌చ్చాం. బ‌న్ని పీఆర్ గానూ కెరీర్ కొన‌సాగుతోంది. పవన్‌ కళ్యాణ్‌.. చరణ్ సినిమాలకు పిఆర్‌ గా ప‌నిచేశాను. ఆ క్ర‌మంలోనే మారుతి- బన్నీ వాసు- యు.వి క్రియేషన్స్‌ వంశీ కలిసి సినిమాలు పంపిణీ చేశాం. అలా సినిమాల‌పై విజ్ఞానం పెరిగిన త‌ర్వాత మారుతి దర్శకత్వం వహించిన తొలి చిత్రం `ఈరోజుల్లో`తో నిర్మాత‌ను అయ్యాను. ఇటీవ‌ల‌ నేను తీసిన టాక్సీవాలా చిత్రం చిరంజీవిగారు చూసి నన్ను ఇంటికి పిలిచి రెండు గంటలు ఆప్యాయంగా మాట్లాడారు. అది నా జీవితంలో మ‌ర్చిపోలేని రోజు.. అని తెలిపారు.

త‌దుప‌రి చిత్రాల గురించి మాట్లాడుతూ.. `ప్రతిరోజూ పండగే` చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నా. టాక్సీవాలా త‌ర్వాత నావెల్టీగా ఉండే స్క్రిప్ట్‌ కోసం వేచి చూస్తున్నా. ఇద్దరు కొత్త దర్శకులు క‌థ‌లు చెప్పారు. స్క్రిప్ట్ వర్క్‌ జరుగుతోంది. త్వ‌ర‌లోనే ఇత‌ర వివ‌రాలు వెల్ల‌డిస్తాను... అని తెలిపారు. ఓవైపు స‌హ‌నిర్మాత‌గా.. మ‌రోవైపు కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హిస్తూ.. సినిమాలు తీస్తున్న ఎస్‌.కె.ఎన్ కి బ‌న్ని- శిరీష్‌ స‌హా ప‌లువురు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అందించారు.