Begin typing your search above and press return to search.

చిరంజీవి పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   18 Aug 2021 5:00 PM IST
చిరంజీవి పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!
X
టాలీవుడ్‌ సమస్యలపై చర్చించడానికి చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో త్వరలో భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో పలువురు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. అయితే ఈ మీటింగ్ ని ఫిల్మ్ ఛాంబర్‌ లో కాకుండా చిరంజీవి ఇంట్లో ప్రైవేట్ గా జరపడంపై నిర్మాత ప్రసన్న కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

'తెలుగు సినిమా పరిశ్రమకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అనేది హెడ్ గా ఉంటే.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ - మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ దానికి కో ఆర్డినేషన్ గా ఉంటాయి. ప్రభుత్వాలతో ఏ సమస్యలపై చర్చించాలన్నా వీటి పేరు మీదుగానే రిప్రెజెంటేషన్ ఇస్తారు. దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నప్పుడు ఛాంబర్ కి వచ్చే అన్ని పనులు చేసేవారు. కానీ ఒక ప్రైవేట్ హౌస్ లో కొద్దిమందితో మీటింగ్ ఎప్పుడూ జరగలేదు. గత రెండేళ్లుగా ఇలాంటివి జరుగుతున్నాయి' అని ప్రసన్న కుమార్ అన్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ కు మీడియాతో సమస్య వచ్చినప్పుడు ఇంట్లో పెట్టుకోలేదు. ఆయన ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చే నిరసన తెలిపారు. అల్లు అరవింద్ - నాగబాబు - బన్నీ - వరుణ్ తేజ్ - సాయి తేజ్ అందరూ అక్కడికే వచ్చి మద్దతు తెలిపారని ప్రసన్న కుమార్ గుర్తు చేస్తున్నారు. ఇండస్ట్రీ సమస్యల పై మాట్లాడుకోవడానికి ఫిల్మ్ ఛాంబర్ ఉంది.. కొన్ని తరాలుగా ఇక్కడే మీటింగ్‌ లు జరుగుతున్నాయి.. ఇలా ప్రైవేట్ హౌస్ లో వాళ్ళకి నచ్చిన కొందరితో సమావేశం జరపడం కరెక్ట్ కాదని నిర్మాత చెప్పారు. చిరంజీవి ముందుండి ఇలాంటివి చేయడాన్ని తప్పు అనడం లేదు.. ఛాంబర్ లో కాకుండా ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టడం విరుద్ధమని చెబుతున్నానని అన్నారు.

ఇండస్ట్రీలో యాక్టివ్ - ఇన్ యాక్టివ్ అన్నవే ఉండవని.. గిల్డ్ లో వున్న నిర్మాతలు సినిమాలు స్వంతంగా తీసి ఎన్నాళ్ళయిందని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఇన్ యాక్టివ్ అని ఎవరన్నా అన్నారా? ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా చిరంజీవి జడ్జ్ అయితే కోర్టులో కాకుండా ప్రైవేటు ప్లేస్ లోనో నిర్వహించి వుండేవారని ప్రసన్నకుమార్ వ్యాఖ్యానించారు. చాంబర్ లేదా కౌన్సిల్ లో అయితే అందరూ సమస్యలపై అభిప్రాయాలు చెబుతారని.. అదే చిరంజీవి ఇంట్లో అయితే తనకు నచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్తారని అన్నారు. గతంలో బాలయ్య నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని ఛాంబర్ నుంచే జరిపారని ప్రసన్న కుమార్ గుర్తు చేశారు.