Begin typing your search above and press return to search.

కన్నడ నటిని మోసం చేసిన కేసులో నిర్మాత అరెస్టు

By:  Tupaki Desk   |   31 Jan 2022 4:42 AM GMT
కన్నడ నటిని మోసం చేసిన కేసులో నిర్మాత అరెస్టు
X
కర్ణాటకకు చెందిన సినీ నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. ఒక నటిని మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకకు చెందిన నిర్మాత హర్షవర్దన్ కు సినిమాలు.. సీరియల్స్ లో నటించే ఒక నటితో పరిచయం.. అది కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య రిలేషన్ మొదలై.. ఆమెను పెళ్లి చేసుకుంటానని అతడు మాటిచ్చినట్లుగా చెబుతున్నారు.

సినిమాలు.. సీరియళ్లలో నటించే ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడు. పెళ్లి ఎప్పుడు అంటే.. దానికి సమాధానం చెప్పటం లేదు. దీంతో ఒత్తిడి చేసిన నటికి బెదిరిస్తున్నాడు. దీంతో షాక్ తిన్న సదరు నటి.. తాను మోసపోయినట్లుగా గుర్తించింది.

నిర్మాత హర్షవర్దన్ మోసం గురించి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీనికి స్పందించిన పోలీసులు.. నటి ఇచ్చిన ఫిర్యాదును కేసుగా నమోదు చేసుకొని.. ఆమె ఇచ్చిన ఆధారాలపై విచారణ జరిపారు. ప్రాధమిక సమాచారం ప్రకారం.. ఆమెను సదరు నిర్మాత మోసం చేసినట్లుగా గుర్తించి అరెస్టు చేశారు. నటిని మోసం చేసి అరెస్టు అయిన నిర్మాత వ్యవహారం స్థానిక ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.