Begin typing your search above and press return to search.

తెలుగు నాట థియేటర్ల మూతేనా.. ?

By:  Tupaki Desk   |   21 Nov 2021 11:30 PM GMT
తెలుగు నాట థియేటర్ల మూతేనా.. ?
X
సినిమా హాల్ అంటే వినోదాల కేంద్రం. అంతేనా తమ అరాధ్య కధానాయకులను అతి పెద్ద తెరమీద చూపించే అద్భుత ఆలయం. ఒకపుడు ఏకైక వినోదంగా థియేటర్ ఉండేది. సరదగా నలుగురూ కలిస్తే సినిమా హాలుకే వెళ్ళేవారు. పెళ్ళీ పేరంటాలు అయితే తప్పనిసరిగా అంతా కలసి థియేటర్ల వద్ద సందడి చేసేవారు. రాను రానూ అనేక రకాలుగా వినోదం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తొంబై దశకంలో టీవీలు రావడంతో సినిమాలకు అతి పెద్ద అండగా ఉండే మహిళలు సీరియల్స్ కి అలవాటు పడిపోయి థియేటర్లకు రావడం తగ్గించేశారు.

రెండు వేల సంవత్సరం తరువాత మరిన్ని మార్పులు వచ్చాయి. సాంకేతికంగా విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దాంతో పాటు పైరసీ కూడా సినిమాకు పెద్ద ప్రతిబంధకం అయింది. సినిమా హాళ్ళో చూసే పని చాలా మందికి తప్పింది. ఇపుడు కొన్నేళ్ళుగా చూస్తే స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని ఎక్కడ లేని వినోదం చేతికి చేరుతోంది. కరోనా తరువాత చూస్తే ఓటీటీల రాకతో యూత్ కూడా థియేటర్లకు రావడం తగ్గించుకున్నారు. ఈ నేపధ్యంలో థియేటర్ల మనుగడ ఎలా అన్న ప్రశ్న అయితే ఉంది.

ఒక సినిమా హాలు మీద ఆధారపడి దాదాపుగా ముప్పయి నుంచి నలభై మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అలాంటిది సినిమా హాళ్లకు జనం రావడం మానుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రెండు వేల పై చిలుకు థియేటర్ల పరిస్థితి ఏంటి అన్నదే ఒక బాధగా ఉంది. ఇక సినిమాలు తీసే వారు కూడా తమకు సరైన సీజన్ ని చూసుకుంటున్నారు. ఒకపుడు ప్రతీ వారం సినిమాలు రిలీజ్ అయ్యేవి. పెద్ద హీరోల సినిమాలు సైతం నెలకు ఒకటిగా రిలీజ్ అయిన రోజులు ఉన్నాయి.

కానీ ఇపుడు బడా సినిమాలు క్రేజీ మూవీస్ అన్నీ కూడా ఒకేసారి కట్టకట్టుకుని వస్తున్నాయి. సంక్రాంతి, సమ్మర్, దసరా ఇలా సీజన్స్ చూసుకుని మరీ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఆ టైమ్ లో అయితే జనాలు బయటకు వచ్చి చూస్తారని భావిస్తున్నారు. జనాలు ఎపుడు వస్తే అపుడే తమ సినిమా అన్నట్లుగా మేకర్స్ ఆలోచనలు ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే థియేటర్లకు రప్పించే సినిమాలు తీయలేకపోతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలో ఏడాదికి పన్నెండు నెలలూ రోజుకు నాలుగు ఆటలు వంతున థియేటర్లు తెరచి నడిపించడం అంటే అయ్యే పనేనా అన్నదే ఎగ్జిబిటర్ల సూటి ప్రశ్న. ఈ మాత్రం భాగ్యానికి ఇన్నేసి థియేటర్లు కూడా దండుగే అన్న వారు కళ్యాణ మండపాలుగా షాపింగ్ కాంప్లెక్స్ గా మార్చేస్తున్నారు. రానున్న రోజులలో పండుగలకే సినిమా హాళ్ళు అన్న కాన్సెప్ట్ మరింత ముదిరితే కచ్చితంగా తెలుగునాట సినిమా హాళ్ళు పెద్ద సంఖ్యలో మూతపడడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి దీని పరిణామాలు, ప్రభావం ఎలా ఉంటాయో.