Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ రింగ్ మాస్ట‌ర్లు రాజకీయాల‌తో విసుగెత్తాను!-పీసీ

By:  Tupaki Desk   |   28 March 2023 5:00 PM
ఇండ‌స్ట్రీ రింగ్ మాస్ట‌ర్లు రాజకీయాల‌తో విసుగెత్తాను!-పీసీ
X
ఇటీవ‌లి కాలంలో దేశ‌వ్యాప్తంగా విస్త్ర‌తంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన కీల‌క అంశాల్లో బాలీవుడ్ మాఫియా ఒక‌టి. ఇక్క‌డ కొంద‌రు పెద్ద‌లు ఇన్ సైడ‌ర్స్ కి ప‌ట్టంగ‌డుతూ ఔట్ సైడ‌ర్స్ ని ఎద‌గ‌నివ్వ‌కుండా అణ‌చివేస్తార‌ని వీళ్ల రింగ్ మాఫియాను భ‌రించ‌డం అంత సులువు కాద‌ని కంగన స‌హా ప‌లువురు స్టార్లు ఆరోపించారు. తాజాగా మ‌రోసారి గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. బాలీవుడ్ లో తాను రాజకీయాలతో తీవ్రంగా విసిగిపోయానని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. నేను ఇక్క‌డివారితో క‌లిసి గొడ్డు మాంసం తిన్నానని కూడా తెలిపారు.

'ఇన్ మై సిటీ' అనే మ్యూజిక్ వీడియోతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా అప్పటి నుండి ఎదురే లేకుండా హ‌వా సాగిస్తోంది. హాలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో పాపుల‌రైంది. తాను అమెరికా ప‌రిశ్ర‌మ‌లోనే ఎందుకు పనిచేయాలని నిర్ణయించుకుందో కూడా పీసీ వెల్లడించింది.

ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లి భారతదేశం గర్వించేలా చేసిన మాట వాస్త‌వం. ప‌శ్చిమాన భారీ ఖ్యాతిని పొందిన అరుదైన కొద్దిమందిలో ప్రియాంక చోప్రా ఒకరు. అలాగ‌ని బాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డ‌లేదు. ఇక్క‌డ క్రేజీగా అవ‌కాశాలొస్తున్న క్ర‌మంలోనే అన్నిటినీ కాద‌నుకుని హాలీవుడ్ లో ప్ర‌య‌త్నించింది. అక్క‌డ వెంటనే అవకాశాల‌ను చేజిక్కించుకుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తాను బాలీవుడ్ కి ఎందుకు దూరంగా వెళ్లాలని నిర్ణయించుకుందో వెల్ల‌డించారు. రాజకీయాలతో విసిగి వేసారి ఇండస్ట్రీ నుంచి బయటకి వచ్చే మార్గం వెతుక్కున్నానని చెప్పారు. అమెరికాలో ఉద్యోగం ఉపాధిని వెతుక్కునే తన ఎత్తుగడ గురించి ప్రియాంక చోప్రా వెల్లడించారు. డాక్స్ షెపర్డ్ తో ఉన్న పోడ్ కాస్ట్ ఆర్మ్ చైర్ ఎక్స్ పర్ట్ కార్య‌క్ర‌మంలో.. ప్రియాంక చోప్రాను USలో ఉద్యోగం వెత‌కాల‌నుకోవ‌డానికి కారణమేమిటి? అని అడిగారు.

దీనికి ప్రియాంక చోప్రా స్పందిస్తూ..''తాను సాత్ ఖూన్ మాఫ్ షూటింగ్ లో ఉన్నప్పుడు 'దేశీ హిట్స్'కు చెందిన ఆచారి యుఎస్ లో మ్యూజిక్ వీడియోల కెరీర్ కోసం తనను సంప్రదించారని చెప్పారు. అప్ప‌టికే తాను బాలీవుడ్ నుండి బయటికి వెళ్లేందుకు దారులు వెతుకుతున్నట్లు వివరించింది.

ఇండస్ట్రీలో రాజకీయాలతో విసిగిపోయానని అన్నిటి నుంచి తనకు విరామం అవసరమని చెప్పింది. నేను ఇండస్ట్రీలో (బాలీవుడ్) ఒక మూలకు గెంటివేసారు. నన్ను సినిమాల‌కు ఎంపిక చేయ‌ని వాళ్లున్నారు. ఇక్క‌డి ప్రజలతో గొడ్డు మాంసం తినాల్సొచ్చింది. నేను ఆ గేమ్ ఆడటం మంచిది కాదు.. రాజకీయాలతో బాగా విసిగిపోయాను. నాకు విరామం అవసరమని భావించాను! అని తెలిపారు.

అప్ప‌ట్లోనే హాలీవుడ్ మ్యూజిక్ వీడియో హద్దులు దాటి వెళ్లే అవకాశాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో నా వైపు రాని అవ‌కాశాల కోసం వెంప‌ర్లాడ‌ను. కానీ కొన్ని క్లబ్ లు .. గ్రూపు రాజ‌కీయాల‌ను బ్రేక్ చేయాల్సిన‌ అవసరం ఉందని పీసీ వెల్ల‌డించింది. తాను బాలీవుడ్ లో సుదీర్ఘ‌ కాలం పనిచేశాననీ అందుకే తాను అలా చేయాలని భావించిన‌ట్టు వెల్ల‌డించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.