Begin typing your search above and press return to search.

#రైతు సమ‌స్య‌.. అమెరికా కోడ‌లిని చూసి మ‌న స్టార్లు నేర్వాలి!

By:  Tupaki Desk   |   7 Dec 2020 11:09 AM IST
#రైతు సమ‌స్య‌.. అమెరికా కోడ‌లిని చూసి మ‌న స్టార్లు నేర్వాలి!
X
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా న్యూదిల్లీలో రైతుల నిరసన రోజులు గడిచేకొద్దీ తీవ్రతరం అవుతోంది. రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు కూడా రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే సెల‌బ్రిటీల్లో ర‌క‌ర‌కాల వ‌ర్గాలు ఒక్కో పార్టీకి కొమ్ము కాయ‌డం సర్వ‌త్రా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

కాంట్ర‌వ‌ర్శీ క్వీన్ కంగన రనౌత్.. పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్ మ‌ధ్య గొడవ గురించి ట్వీట్ వార్ గురించి తెలిసిన‌దే. ట్విట్టర్ ‌లో హ‌ద్దు మీరి మాటల యుద్ధానికి దిగారు. స్టార్ల‌లో రైతుల‌కు వ్య‌తిరేకంగా మోదీకి స‌పోర్టునిచ్చేవాళ్లు కొంద‌రైతే.. వ్య‌తిరేకించేవారు లేక‌పోలేదు.

తాజాగా అమెరికా కోడ‌లు .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ స‌మ‌స్య‌పై స్పందించారు. రైతులను ‘ఫుడ్ సోల్జర్స్’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. “వారి (రైతులు) భయాలకు జ‌వాబు చెప్పి స‌మ‌స్య‌ని తీర్చాల్సిన అవసరం ఉంది. వారి ఆశలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశ‌మిది.. ఈ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించాలి ” అంటూ వ్యాఖ్యానించారు.

రాజకీయ ఎజెండాతో పార్టీల‌కు క‌ట్టుబ‌డి కాకుండా పీసీ ఇలా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మద్దతునివ్వ‌డం హ‌ర్షించ‌ద‌గిన ప‌రిణామం. పీసీ లానే రైతులకు మద్దతు ప‌లుకుతూ సన్నీ డియోల్ ప్ర‌క‌ట‌న ఇంత‌కుముందు వైర‌ల్ గా దూసుకెళ్లింది. బిజెపి ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను స‌వ‌రించాల‌న్న నిర్ణ‌యం స‌రికాద‌న్న నినాదం బాలీవుడ్ లోనూ ఊపందుకుంటోంది. ఇక ప్రియాంక చోప్రా డేరింగ్ ప్ర‌పోజ‌ల్ అంద‌రిలో స్ఫూర్తిని నింపుతోంది. అయితే టాలీవుడ్ నుంచి స్టార్లు దీనిపై స్పందించాల్సి ఉంది. అన్న‌దాత లేనిదే తిండి లేదు. ప్ర‌జ‌లు మిగ‌ల‌రు. పంట పండ‌నిదే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్ల‌వు. ఇది గుర్తెరిగి రైతుల‌కు అండ‌గా సెల‌బ్రిటీలు నిల‌వాల్సి ఉంటుంది.

మ‌రోవైపు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు డిసెంబర్ 8 న ‘భారత్ బంద్’ కు పిలుపునిచ్చారు. అనేక రాష్ట్రాల నుంచి రాజ‌కీయ పార్టీలు రైతులు క‌దిలి ఉద్య‌మించేందుకు ముందుకొస్తున్నారు. ఇది కేంద్రానికి బిగ్ పంచ్ అనే చెప్పాలి.