Begin typing your search above and press return to search.

చైతూ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్?

By:  Tupaki Desk   |   24 May 2021 5:30 AM GMT
చైతూ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్?
X
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన నాజూకుదనం పేరే ప్రియాంక అరుళ్ మోహన్. సున్నితంగా .. సుకుమారంగా కనిపించే ఈ అమ్మాయి, తన చూపులతోనే పడుచు హృదయాలను ఆక్రమించేసింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసులను జయించేసింది. పాలమీగడలా .. వెన్నముద్దల కనిపించే ఈ అమ్మాయికి, అబ్బాయిలందరూ అభిమానులుగా మారిపోయారు. ఆమె సినిమా ఉంటే థియేటర్లకే అందం వస్తుందన్నంతగా మురిసిపోయారు. ఆమె తదుపరి సినిమాల విశేషాలను తెలుసుకునేవారి జాబితాలో పొలోమంటూ చేరిపోయారు.

యూత్ లో ప్రియాంకకు ఉన్న క్రేజ్ వల్లనే ఆమెకి 'శ్రీకారం' సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఆమె కోర చూపులు .. కొంటె నవ్వులు చూసిన వాళ్లంతా, మిగతా మూడు ఆటలు కూడా చూస్తేనే తప్ప ఇంటికి వెళ్లకూడదని అనుకున్నారు. అంతగా ఈ పిల్ల మనసులను పట్టేసింది .. తమలపాకులా చుట్టేసింది. అయితే అమ్మడి గ్లామర్ కి మంచి మార్కులు పడినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆడలేదు. దాంతో తెలుగు నుంచి అవకాశాలు అంతగా వెళుతున్నట్టుగా కనిపించడం లేదు.

తమిళంలో శివ కార్తికేయ .. సూర్య సినిమాలు చేస్తున్న ప్రియాంక, అక్కడే కాస్త గట్టిగ దృష్టి పెట్టాలని అనుకుంటోందట. ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లినట్టుగా తెలుస్తోంది. నాగచైతన్య కొత్త ప్రాజెక్టు కోసం ఆమెను సంప్రదించారని అంటున్నారు. అయితే ఈ సినిమాకి దర్శక నిర్మాతలు ఎవరనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. ప్ర్రస్తుతం చైతూ చేస్తున్న 'థ్యాంక్యూ' తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. ఇక చైతూ తాజా చిత్రమైన 'లవ్ స్టోరీ' .. విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.