Begin typing your search above and press return to search.

ప్రేమమ్ ట్రైలర్ చితగ్గొట్టేసింది

By:  Tupaki Desk   |   22 Sep 2016 10:32 AM GMT
ప్రేమమ్ ట్రైలర్ చితగ్గొట్టేసింది
X
రీమేక్ సినిమాలనగానే ప్రతిదీ ఒరిజినల్ తో పోల్చి పోల్చి చూస్తారు జనాలు. మక్కీకి మక్కీ ఉన్నా కష్టమే. మార్చినా కష్టమే. అందులోనూ ‘ప్రేమమ్’ లాంటి ఫీల్ ఉన్న సినిమాల్ని రీమేక్ చేయడం అంటే కత్తి మీద సామే. అందుకే ఈ సినిమా విషయంలో చాలామంది ముందు సందేహాలు వ్యక్తం చేశారు. ఐతే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పటిదాకా బయటికి వచ్చిన విశేషాలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

ఎవరే ఎవరే పాట కానీ.. దాని వీడియో కానీ.. బలమైన ముద్రే వేశాయి. తాజాగా రిలీజైన ప్రేమమ్ ట్రైలర్ కూడా యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది. ‘ప్రేమమ్’ ప్రొడక్షణ్ హౌజ్ సితార ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజైన ట్రైలర్ అప్పుడే మిలియన్ మార్కును దాటేసింది. రెండు రోజుల్లోపే ఈ ట్రైలర్ 11 లక్షల దాకా వ్యూస్ తెచ్చుకుంది. ఈ సినిమా మీద జనాల్లో ఏ స్థాయిలో ఆసక్తి ఉందో చెప్పడానికి ఇదే రుజువు.

ఆహ్లదంగా సాగిన ‘ప్రేమమ్’ ట్రైలర్ సినిమా మీద అంచనాల్ని బాగానే పెంచింది. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి మాతృకలోని సోల్ మిస్ కాకుండానే తెలుగు టచ్ ఇచ్చినట్లున్నాడు. మన నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులూ చేసినట్లున్నాడు. మలయాళంలో మడోన్నా క్యారెక్టర్ తక్కువుంటుంది. తెలుగులో దాన్ని పెంచడమే కాక ఒకట్రెండు పాటలు కూడా జోడించినట్లున్నాడు. అక్కినేని నాగార్జున.. విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలు పోషించడం కూడా సినిమాకు కలిసొచ్చేదే. దసరా కానుకగా అక్టోబరు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.