Begin typing your search above and press return to search.

నాకు సినీ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదన్న ప్రకాష్ రాజ్

By:  Tupaki Desk   |   4 Oct 2021 7:31 AM GMT
నాకు సినీ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదన్న ప్రకాష్ రాజ్
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ దూకుడు పెంచాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ‘మా’ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు మంచు విష్ణు ప్యానెల్ దూకుడుగా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ వేగంగా మీటింగ్ లు పెట్టుకుంటూ ఓటర్లను కలుపుకుంటూ పోయే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన అభ్యర్థులుగా ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల విమర్శల వాడి పెరిగింది. తాజాగా ఎఫ్ఎన్.సీసీ లో జరిగిన లంచ్ మీట్ లో ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మా ఎన్నికల్లో ఎలాంటి పెద్దల ఆశీర్వాదం నాకొద్దని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం ప్రశ్నించకపోతే ఈసారి ఎన్నికలు ఉండేవి కావన్నారు. ‘మా’ ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారని.. నేను ఒక ఉత్తరం రాస్తే మా అసోసియేషన్ కు తాళం పడేదన్నారు. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడడం కూడా తెలుసునన్న ప్రకాష్ రాజ్.. మా ఎన్నికల్లో వైఎస్ జగన్, కేసీఆర్, బీజేపీలను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.

వైఎస్ జగన్ మీ బంధువైతే ‘మా’ ఎన్నికలకు వస్తారా? ఓటేయిస్తారా? అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు హలో చెబితే కేసీఆర్ ఫ్రెండ్ అయిపోతారా? అని నిలదీశారు. మీరు గెలవడానికి ప్రయత్నించండని.. అవతలివారిని ఓడించడానికి కాదన్నారు.

ఇక నటుడు నరేశ్ అహంకారి అని.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలన్నారు ప్రకాష్ రాజ్. మా అసోసియేషన్ సిగ్గు పడేలా నరేశ్ ప్రవర్తిస్తున్నారని.. శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్నానంటోన్న నరేశ్ ‘చక్రం’ దొబ్బేశామని అన్నారు. చాలా బాధతో, ఆక్రోశంతో మాత్రమే సమస్యలను పరిష్కరించాలని పోటీచేస్తున్నామని ప్రకాష్ రాజ్ జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా సినీ కళాకారులకు కొంచెం కోపం, బాధతో వేసే ఓటు సునామీలో మంచు విష్ణు కొట్టుకుపోవాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చాడు.