Begin typing your search above and press return to search.

‘తెగేదాకా లాక్కండి’.. ప్రకాశ్ రాజ్ ట్వీట్.. ‘మా’ ఎన్నికల్లో భాగమేనా?

By:  Tupaki Desk   |   5 Aug 2021 3:19 AM GMT
‘తెగేదాకా లాక్కండి’.. ప్రకాశ్ రాజ్ ట్వీట్.. ‘మా’ ఎన్నికల్లో భాగమేనా?
X
మూవీ ఆర్టిస్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన పలు పరిణామాలు ఇటీవల చోటు చేసుకోవటం తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలో ఉన్నట్లు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ప్రకటన తో మొదలైన హడావుడి మూడు రోజులు ముగిసేసరికి ఏకంగా ఐదుగురు పోటీకి వచ్చేయటం తెలిసిందే. ఏకగ్రీవమని కొందరు.. ఎన్నికల ద్వారానే తేల్చుకోవాలన్న మాటలు వినిపించాయి. పేరుకు పోటీలో ఐదుగురు ఉన్నట్లు చెబుతున్నా పోటీ అంతా ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు అన్నట్లే నడుస్తోంది. ఎందుకంటే.. బరిలోకి దిగుతామన్న మిగిలిన ముగ్గురు మౌనంగా ఉండటమే దీనికి కారణం.

ఇదిలా ఉంటే ఇటీవల మంచు విష్ణు మాట్లాడుతూ.. పెద్దలంతా ఏకగ్రీవమని డిసైడ్ చేస్తే తాను బరిలో నుంచి తప్పుకుంటానని.. పెద్దల మాటను తాను గౌరవిస్తానంటూ ప్రకటన చేయటం ద్వారా తానేం చేయాలనుకుంటున్న విషయాన్ని చెప్పేశారు. పోటీ అనేది ఉంటే తాను పక్కాగా ఉంటానని తాజా ప్రకటనతో స్పష్టం చేసినట్లైంది. ఇదిలా ఉంటే ఈ మధ్యన జరిగిన ‘మా’ ఈసీ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నరేశ్ మాట్లాడుతూ.. తమ కార్యవర్గానికి చట్టబద్దత ఉన్నట్లేనని.. ఎన్నికలు జరిగే వరకు గరిష్ఠంగా ఆరేళ్ల వరకు అధికారం ఉంటుందని చెప్పారు.

ఓవైపు ఎన్నికలు జరుగుతాయన్న భావనను కలిగిస్తూనే.. మరోవైపు తాను చెప్పినట్లు జరగకుంటే ఎన్నికలు ఆలస్యమవుతాయన్నట్లుగా నరేశ్ మాటలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. ‘మా’ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే అనే మాటకు బదులుగా.. ఏమవుతుందో తెలీని సందిగ్థ పరిస్థితికి తీసుకొచ్చారు. వాస్తవానికి సెప్టెంబరులో ఎన్నికలు జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశ్ రాజ్ తన ట్విటర్ ఖాతాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. తన జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ టాగ్ తో.. ‘‘తెగేదాకా లాక్కండి’’ అంటూ సింఫుల్ ట్వీట్ చేసి కొత్త చర్చను షురూ చేశారు. తెలుగులో చేసిన ట్వీట్ కచ్ఛితంగా ‘‘మా’’ ఎన్నికలకు సంబంధించిందే అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాఫీగా సాగిపోవాల్సిన ఎన్నికల ప్రక్రియను.. న్యాయవాదుల సలహాల్ని చూపించి ఆలస్యం చేస్తే బాగోదన్నట్లుగా ఆయన ట్వీట్ సారాంశమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

‘మా’ ఎన్నికలు కాకుండా ఇంకేదైనా అంశంపైన ఈ ట్వీట్ చేసి ఉంటే.. వైరల్ గా మారినంతనే మరో ట్వీట్ చేసి ఉండేవారన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా తెగేదాకా లాక్కండంటూ సింఫుల్ గా చేసిన ట్వీట్ లో హెచ్చరిక దాగి ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ మరోసారి ‘మా’ ఎన్నిక ఎపిసోడ్ లో కదలికను తీసుకొస్తుందని చెప్పక తప్పదు.