Begin typing your search above and press return to search.
సంతకం చేయలేదన్న ప్రకాష్ రాజ్
By: Tupaki Desk | 25 July 2018 3:32 PM ISTనటి భావనను లైంగికంగా హింసించిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్న మలయాళ నటుడు దిలీప్ జైలు పాలై ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే అతడిని మళ్లీ మలయాళ సినీ ఆర్టిస్టుల సంఘం (అమ్మా)లోకి తీసుకోవడం దుమారం రేపింది. దీనిపై చాలా మంది మలయాళ సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మా అధ్యక్షుడు మోహన్ లాల్ మీద తీవ్ర విమర్శలు చేశారు.
ఇటీవలే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల కార్యక్రమానికి మోహన్ లాల్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీనిపై మలయాళ సినీ ప్రముఖులు చాలా మంది అభ్యంతరం తెలిపారు. బిజు కుమార్ దామోదరన్ అనే దర్శకుడు ఈ విషయమై ఏకంగా కేరళ ముఖ్యమంత్రికి పెద్ద లేఖే రాశారు. ఈ వేడుకకు మోహన్ లాల్ ను ఆహ్వానించవద్దని.. దీనికి వ్యతిరేకంగా వంద మంది సీనీ ప్రముఖులు సంతకాలు చేశారని లేఖను విడుదల చేశారు. ఆ వందమందిలో ప్రముఖ నటుడు విలన్ ప్రకాష్ రాజ్ - హీరో మాధవన్ లాంటి వారు ఉన్నారు.
ఈ లేఖ కేరళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. తాజాగా ప్రకాష్ రాజ్ ఈ విషయంపై స్పందించారు. ‘మోహన్ లాల్ కు వ్యతిరేకంగా ఇచ్చిన లేఖపై సంతకం చేశానని వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదు. దిలీప్ విషయంలో ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించా.. కానీ మోహన్ లాల్ కు వ్యతిరేకంగా సంతకం చేశానన్నది మాత్రం అబద్ధం’ అని క్లారిటీ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ బయటపడడంతో చాలా మంది ప్రముఖులు తాము కూడా మోహన్ లాల్ కు వ్యతిరేకంగా సంతకాలు చేయలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ లేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
