Begin typing your search above and press return to search.

ఈ బిడ్డ సుశాంత్ నెపోటిజంలో సర్వైవ్ కాలేకపోయాడు : విలక్షణ నటుడు

By:  Tupaki Desk   |   16 Jun 2020 3:00 PM GMT
ఈ బిడ్డ సుశాంత్ నెపోటిజంలో సర్వైవ్ కాలేకపోయాడు : విలక్షణ నటుడు
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సుశాంత్ మరణంపై సినీ రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే అవకాశాలు లేకపోవడం వల్లే సుశాంత్‌ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడంటూ బాలీవుడ్‌ పెద్దలపై గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని.. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా హీరోలుగా వచ్చిన వాళ్లను ఎదగనివ్వరని కామెంట్ చేసింది. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సినీ ఇండస్ట్రీలో ఉండే నెపోటిజంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

''నేను ఇండస్ట్రీలో ఉండే నెపోటిజంలో జీవించాను.. కానీ నేను దాని నుండి బయటపడ్డాను... నా మనసుకి తగిలిన గాయాలు నా మాంసం కన్నా లోతుగా ఉన్నాయి.. కానీ ఈ బిడ్డ సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సర్వైవ్ కాలేకపోయాడు.. మేము నేర్చుకుంటాం.. మేము నిజంగా నిలబడతాం.. అలాంటి కలలు చనిపోనివ్వం..'' అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసారు. అంతేకాకుండా దీనికి సుశాంత్ ఓ సందర్భంలో బాలీవుడ్ లో నెపోటిజం పై మాట్లాడిన ఓల్డ్ వీడియో ఒకటి షేర్ చేసారు. ఈ వీడియోలో సుశాంత్ మాట్లాడుతూ "బాలీవుడ్‌ లోనే కాదు.. ప్రతిచోటా నెపోటిజం ఉంది. మీరు దాన్ని ఏమీ చేయలేరు. అది ఎప్పటికీ ఉంటుంది. కానీ అది ఏమీ చేయలేదు. కానీ అదే సమయంలో మీరు ఉద్దేశపూర్వకంగా టాలెంట్ ని ఎదగనీయకుండా చేస్తే అప్పుడు ఒక సమస్యగా మారుతుంది. దీంతో ఇండస్ట్రీ నిర్మాణం మొత్తం ఒక రోజు కూలిపోతుంది... "అని చెప్పుకొచ్చాడు.