Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ లో మరో తండ్రి పాత్రకు కొడుకు..!

By:  Tupaki Desk   |   8 Dec 2018 1:21 PM GMT
ఎన్టీఆర్‌ లో మరో తండ్రి పాత్రకు కొడుకు..!
X
‘ఎన్టీఆర్‌’ చిత్రంలో తన తండ్రి ఎన్టీ రామారావు పాత్రను బాలకృష్ణ పోషిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో అప్పటి స్టార్స్‌ పాత్రల్లో ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పాత్రను కూడా ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చూపించబోతున్నారు. రాఘవేంద్ర రావు పాత్ర కోసం వారు, వీరు అంటూ ఎంతో మంది పేర్లు వినిపించాయి. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రాఘవేంద్ర రావు పాత్రను ఆయన తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి పోషించనున్నాడట.

రాఘవేంద్ర రావు నట వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయిన ప్రకాష్‌ ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు చిత్రాలు చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. నటనపై పెద్దగా ఆసక్తి లేనప్పటికి ఎన్టీఆర్‌ చిత్రంలో తన తండ్రి పాత్రకు క్రిష్‌ అడిగిన వెంటనే కాదనకుండా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాఘవేంద్ర రావు పాత్రకు సంబంధించిన చిత్రీకరణలో ప్రకాష్‌ పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తోంది.

భారీ స్థాయిలో, భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడు లోనే పలువురు సినీ ప్రముఖులు కనిపించబోతున్నారు. అంతా కూడా మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. అలాగే ప్రకాష్‌ కోవెలమూడి కూడా కొద్ది సమయమే కనిపిస్తాడని తెలుస్తోంది.