Begin typing your search above and press return to search.

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టుపై ప్రభుదేవా నజర్

By:  Tupaki Desk   |   8 Jun 2016 8:04 AM GMT
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టుపై ప్రభుదేవా నజర్
X
ఆల్రెడీ దర్శకరత్న దాసరి నారాయణరావు మహాభారతాన్ని నాలుగైదు భాగాలుగా తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించాడు. మరోవైపు రాజమౌళి కూడా మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు. ఐదేళ్లకో పదేళ్లకో.. ఎప్పుడో ఒకప్పుడు ఆ సినిమా చేయడం ఖాయం అని కూడా ఆ మధ్య స్టేట్ మెంట్ ఇచ్చాడు. మరోవైపు బాలీవుడ్ లో సైతం మహాభారతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతమంది వరుసలో ఉన్నా.. తాను కూడా మహాభారతం తీయాలని అనుకుంటున్నాడు ప్రభుదేవా. తనకు కూడా అది కలల ప్రాజెక్టు అని చెబుతున్నాడతను.

దర్శకుడిగా ముందు తెలుగులో అరంగేట్రం చేసి.. ఆ తర్వాత కోలీవుడ్ బాట పట్టి.. ఆపై బాలీవుడ్లోనూ హవా సాగించిన ప్రభుదేవా నెక్స్ట్ తన టార్గెట్ హాలీవుడ్డే అంటున్నాడు ప్రభుదేవా. పదకొండేళ్ల వ్యవధిలో 13 సినిమాలు తీసేసి డ్యాన్స్‌ లోనే కాదు.. డైరెక్షన్లోనూ తనకు స్పీడెక్కువే అని చూపించిన ప్రభుదేవా ఇప్పుడో మహాభారతాన్ని హాలీవుడ్ లెవెల్లో తీయాలనుకుంటున్నాడు. ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిన మన పురాణగాథ మహాభారతాన్ని హాలీవుడ్ సినిమాలా తెరకెక్కించాలని అంటున్నాడు మల్టీ టాలెంటెడ్ ప్రభుదేవా. ‘‘మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్టు. ఐతే దాన్ని ఆషామాషీగా తీయాలనుకోవట్లేదు. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తరహాలో మహాభారతాన్ని హాలీవుడ్ సినిమాలా తీయాలని ఉంది’’ అని ప్రభుదేవా చెప్పాడు. మరి ప్రభుదేవా చేయాలనుకుంటున్న సాహసానికి పెట్టుబడి పెట్టేదెవరు?