Begin typing your search above and press return to search.

పరుగులు పెడుతున్న ప్రభాస్..!

By:  Tupaki Desk   |   13 Sep 2021 6:36 AM GMT
పరుగులు పెడుతున్న ప్రభాస్..!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన ప్రభాస్.. ఒకేసారి మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న 'రాధే శ్యామ్' షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

అలానే 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''సలార్'' - బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో చేస్తున్న పౌరాణిక చిత్రం ''ఆది పురుష్'' చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇదే క్రమంలో ఇటీవల నాగ్ అశ్విన్ తో ''ప్రాజెక్ట్ K'' అనే పాన్ వరల్డ్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే ప్రభాస్ ముందుగా 'సలార్' మరియు 'ఆదిపురుష్' చిత్రాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో రీసెంటుగా ముంబైలో జరుగుతున్న 'ఆదిపురుష్' షెడ్యూల్ షూట్ లో ప్రభాస్ పాల్గొన్నారు. బాంబే షెడ్యూల్ కంప్లీట్ చేసి, ఇప్పుడు 'సలార్' తాజా షెడ్యూల్ కోసం హైదరాబాద్ చేరుకున్నాడు ప్రభాస్. రామోజీ ఫిల్మ్ సిటీలో ''సలార్'' చిత్రంలోని కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోందని.. ఇందులో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది.

యాక్షన్ ఎపిసోడ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టే డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రభాస్ తో ఎలాంటి ఫైట్స్ చేయిస్తారో చూడాలి. ఇందులో డార్లింగ్ ని మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా చూపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ లో హింట్ ఇచ్చారు. అది కూడా ఓ గ్యాంగ్ స్టర్ పాత్ర అని.. ప్రభాస్ ఇంతకుముందెన్నడు కనిపించని సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇకపోతే 'సలార్' చిత్రాన్ని హాలీవుడ్ సినిమాల తరహాలో బ్లాక్ థీమ్ తో తెరకెక్కిస్తున్నారని టాక్. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీని రూపొందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 2022 ద్వితీయార్థంలో 'సలార్' 'ఆది పురుష్' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.