Begin typing your search above and press return to search.

బాహుబలి పొలం దున్నుతాడట!

By:  Tupaki Desk   |   21 Jun 2018 7:46 AM GMT
బాహుబలి పొలం దున్నుతాడట!
X
డార్లింగ్ ప్రభాస్ పైకి కనిపించడు కానీ భలే మాటకారి. చిన్న చిన్న మాటలతో పజిల్స్ తరహాలో సమాధానాలు ఇస్తుంటాడు. తాజాగా ఒక ప్రముఖ బాలీవుడ్ వెబ్ పోర్టల్ అడిగిన కొన్ని ప్రశ్నలకు తెలివిగా ఆన్సర్స్ ఇచ్చి వాళ్ళను కన్ఫ్యూజన్ లో పడేసాడు. సాహో తర్వాత ఏ సినిమా చేయబోతున్నారు అన్న ప్రశ్నకు ఏమో అది పూర్తయ్యాక నేను ఏదైనా వ్యాపారం లేదా ఇష్టమైన వ్యవసాయం చేస్తానేమో అని చెప్పడం బాగా పేలింది. షూటింగ్ లో జరుగుతున్న విపరీతమైన జాప్యానికి కౌంటర్ వేయడానికి ప్రభాస్ సినిమాల కన్నా వ్యవసాయం బెటర్ అన్నాడా లేక అడిగిన వాళ్ళను ఉడికించడానికా మాత్రం అర్థం కాలేదు. మొత్తానికి ప్రభాస్ మనసులో రైతు అవతారం ఎత్తాలని ఉందని మాత్రం అర్థమైపోయింది. నిజ జీవితంలో సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే అదేదో సినిమాలో చేస్తే మాత్రం భలేగా ఉంటుంది అనుకుంటున్నారు ఫాన్స్.

సాహో విశేషాల గురించి చెబుతూ శ్రద్ధ కపూర్ చాలా సులభంగా తెలుగు డైలాగులు చెబుతోందని తనకే హిందీ పలకడం కష్టంగా అనిపించి ఇబ్బంది పడుతున్నానని ఒప్పేసుకున్నాడు ప్రభాస్. అంటే తన మాటలను బట్టి సాహో హిందీ వెర్షన్ డబ్బింగ్ రూపంలో కాదు స్ట్రెయిట్ గానే తీస్తున్నారు అని మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ సాహో కన్నా ముందే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయటం గురించి గట్టిగానే ప్రచారం జరుగుతోంది. కానీ దానికి మాత్రం దాటవేత సమాధానం చెబుతున్న ప్రభాస్ సాహో ఎప్పుడు విడుదల అవుతుంది అనేది మాత్రం చెప్పలేకపోతున్నాడు. సంక్రాంతి రేసులో ఉండొచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి కానీ దాదాపు ఆ ఛాన్స్ లేనట్టే .