Begin typing your search above and press return to search.

బాహుబలి విజయం.. యూనిట్ కష్టం -ప్రభాస్‌

By:  Tupaki Desk   |   20 Oct 2015 5:00 PM IST
బాహుబలి విజయం.. యూనిట్ కష్టం -ప్రభాస్‌
X
టాలీవుడ్ కే కాదు.. మొత్తం భారతీయ చలనచిత్ర చరిత్రకే తలమానికంగా నిలిచిన చిత్రం బాహుబలి. ప్రస్తుతం దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీస్ లో రెండో స్థానంలో ఉన్న బాహుబలి.. మరిన్ని దేశాల్లో రిలీజ్ అవుతూ త్వరలో మొదటి స్థానానికి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. ప్రజాభిమానంలో, భారతీయుల సత్తా చాటడంలో ఇప్పటికే తొలిస్థానానికి చేరిపోయింది ఈ మూవీ. బాహుబలికి ముందు ఓ లెక్క, తర్వాత ఓ లెక్క అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.

ఇంతటి అద్భుతమైన, విజయంవతమైన సినిమాని రూపొందించినా.. అంతా టీం వర్క్ కారణంగానే అంటున్నాడు బాహుబలి హీరో ప్రభాస్. ఓ సినిమా విజయంలో మొత్తం యూనిట్ కష్టం ఎలా ఉంటుందో, చిన్న స్థాయి నుంచి అందరూ కష్టపడ్డం ఏంటో తెలుసుకున్నాని చెబ్తున్నాడు. బాహుబలి విజయానికి దర్శకుడు రాజమౌళి నుంచి మూవీకోసం శ్రమపడ్డ ప్రతి ఒక్కరి కష్టం కారణమే అంటున్నాడు రెబల్ స్టార్. 6వందల కోట్లకు మించిన కలెక్షన్లు రాబట్టిన సినిమాకి హీరో అయి కూడా.. ఇంకా తనను జాతీయ స్థాయి హీరో అని చెప్పుకునేందుకు అంగీకరించడం లేదు ప్రభాస్.

మన రెబల్ స్టార్ నటించిన పాత మూవీస్ అన్నీ ఇప్పుడు డబ్బింగ్ అయిపోతున్నాయి అన్ని భాషల్లోకి. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. మిర్చి లాంటి బ్లాక్ బస్టర్స్ నుంచి ఏక్ నిరంజన్ లాంటి ఓ మోస్తరు సినిమాలు కూడా డబ్బింగ్ తో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర కానున్నాయి. ఇంత పెద్ద సినిమా తీయడం ఒక కష్టమైతే.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంతకంటే కష్టమని.. దాన్ని బాహుబలి యూనిట్ సాధించిందని చెప్పాడు. బాహుబలి ఖచ్చితంగా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉన్నా.. ఈ స్థాయిలో విజయవంతం కావడాన్ని మాత్రం ఏమాత్రం ఊహించలేదట.

ప్రస్తుతం బాహుబలి హిందీ - తెలుగు వెర్షన్లు టీవీల్లోనూ సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ దసరా తర్వాత రెండు భాషల ప్రేక్షకులను బుల్లితెరపై అలరించనున్నాడు బాహుబలి.