Begin typing your search above and press return to search.

మహేష్ రిజెక్ట్ చేసిన స్టోరీతో ప్రభాస్ సినిమా..?

By:  Tupaki Desk   |   9 Oct 2021 8:00 AM IST
మహేష్ రిజెక్ట్ చేసిన స్టోరీతో ప్రభాస్ సినిమా..?
X
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి వంగా.. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత అదే చిత్రాన్ని 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇదే క్రమంలో హిందీలో 'యానిమల్' అనే మరో సినిమాని అనౌన్స్ చేశాడు కానీ.. రణబీర్ కపూర్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇప్పుడు తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ''స్పిరిట్'' అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించారు.

'స్పిరిట్' కంటే ముందు పలువురు స్టార్ హీరోలతో సందీప్ వంగా సినిమా చేయబోతున్నారని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయనున్నాడని ఎక్కువగా చెప్పుకున్నారు. నిజానికి 'అర్జున్ రెడ్డి' తర్వాత మహేష్ ని కలిసి ఓ పవర్ ఫుల్ కథ ను వినిపించాడు. అయితే మహేష్ ఆ స్టోరీని సున్నితంగా తిరస్కరించడంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు స్పెషల్ ట్విట్టర్ స్పేస్ సెషన్ లో పాల్గొన్న సందీప్ వంగా.. సూపర్ స్టార్ కథ చెప్పిన విషయాన్ని వెల్లడించారు. తను చెప్పిన స్టోరీ మహేష్ కు నచ్చలేదని.. మరో కొత్త స్క్రిప్ట్ తో కలుస్తానని చెప్పాడు. మహేష్ తో కచ్చితంగా సినిమా చేస్తానని సందీప్ తెలిపారు. అయితే ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న 'స్పిరిట్' సినిమా.. ఇంతకముందు మహేష్ కు చెప్పిన కథతోనే అని టాక్ వినిపిస్తోంది.

సందీప్ వంగా మొదట మహేష్ బాబు కు చెప్పిన స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రభాస్ కు వినిపించారట. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు స్టైల్ కు తగ్గట్లుగా హీరో క్యారెక్టరైజేషన్ ను మార్చారట. ప్రభాస్ ను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించబోతున్నామని మేకర్స్ తెలిపారు. అది ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ అని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇకపోతే 'స్పిరిట్' సినిమా ప్రభాస్ కెరీర్ లో మైలురాయి 25వ ప్రాజెక్ట్. పాన్ ఇండియా స్థాయిలో టి సిరీస్ - యూవీ క్రియేషన్స్ మరియు సందీప్ వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాయి. భూషణ్ కుమార్ - వంశీ - ప్రమోద్ - వంగా ప్రణయ్ రెడ్డి దీనికి నిర్మాతలు. ప్రభాస్ తో 'సాహో' 'రాధే శ్యామ్' వంటి సినిమాలు చేసిన టీ సిరీస్ వారు ప్రస్తుతం 'ఆది పురుష్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సందీప్ ఇంతకముందు ఇదే బ్యానర్ లో 'కబీర్ సింగ్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు 'స్పిరిట్' చిత్రాన్ని 'యానిమల్' కంటే ముందు సెట్స్ మీదకు తీసుకెళ్తారా? లేదా తర్వాత షూటింగ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.