Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఆ నాటి పరిచయాన్ని గుర్తుంచుకుని

By:  Tupaki Desk   |   24 April 2019 10:07 AM IST
ప్రభాస్.. ఆ నాటి పరిచయాన్ని గుర్తుంచుకుని
X
సూపర్ స్టార్లు ఏదైనా సినిమా వేడుకకు రావాలంటే దానికో స్థాయి ఉండాలి. చిన్న సినిమాల వేడుకల్లో పెద్ద హీరోలు కనిపించడం అరుదే. అలాంటిది ‘నువ్వు తోపురా’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ వస్తాడని ఎవరైనా ఊహిస్తారా? కానీ ఇండస్ట్రీలో అందరితోనూ ‘డార్లింగ్’ అని పిలిపించుకునే ప్రభాస్.. ఈ ట్రైలర్ లాంచ్ చేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన హరినాథ్‌ తో ఉన్న చిన్న పరిచయమే ఇందుక్కారణం.

ప్రభాస్ హీరోగా పరిచయం అయిన ‘ఈశ్వర్’ సినిమాకు అతను దర్శకత్వ శాఖలో పని చేశాడట. ఐతే దాదాపు రెండు దశాబ్దాల కిందట, తమకంటూ ఒక స్థాయి లేనపుడు నటించిన సినిమాకు పని చేసిన వ్యక్తుల్ని ఇప్పుడు సూపర్ స్టార్ రేంజిలో ఉండగా గుర్తుంచుకునేవాళ్లు ఎంతమంది ఉంటారు? ఈ స్థితిలో ప్రభాస్‌ ను కలవడమే కష్టం. పైగా తమ సినిమా ట్రైలర్ లాంచ్ చేయమని అడిగితే అతను ఒప్పుకోవడం విశేషమే. ‘సాహో’ లాంటి భారీ సినిమాలో నటిస్తూ తీరిక లేకుండా ఉన్న ప్రభాస్ పెద్ద మనసుతో వచ్చిన హరినాథ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘నువ్వు తోపురా’ ట్రైలర్ లాంచ్ చేశాడు.

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజు పాత్రలో కనిపించిన సుధాకర్ కోమాకుల ఈ చిత్రంలో హీరోగా నటించాడు. అనుకోకుండా అమెరికాకు వెళ్లి జీవిత పోరాటం చేసిన పక్కా హైదరాబాదీ కుర్రాడి కథ ఇది. ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగానే అనిపిస్తోంది. మే 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. నిరోషా అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించిందీ చిత్రంలో. అల్లు అరవింద్ తన బేనర్ మీద ‘నువ్వు తోపురా’ను రిలీజ్ చేస్తారని సమాచారం.