Begin typing your search above and press return to search.

ప్రభాస్ అలా చేస్తే బాగుంటుందన్న ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   7 Dec 2020 8:40 AM IST
ప్రభాస్ అలా చేస్తే బాగుంటుందన్న ఫ్యాన్స్
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ స్థానం ప్రత్యేకం. చాలా తక్కువ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. సాధారణంగా హీరోలుగా తమ కెరియర్ ను మొదలుపెట్టిన చాలామంది, రొమాంటిక్ హీరోగా యూత్ నుంచి .. కుటుంబ కథా చిత్రాల ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి .. యాక్షన్ మూవీస్ ద్వారా మాస్ ఆడియన్స్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంటారు. ఇలా ఏదో ఒక వర్గం ప్రేక్షకుల నుంచే ఆదరణ పొందుతూ ఉంటారు. ఆ తరువాత ఆ వర్గం ప్రేక్షకులకు నచ్చే కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతుంటారు. కానీ ఈ మూడు వర్గాల ప్రేక్షకులను అతితక్కువ కాలంలో ఆకట్టుకున్న హీరోగా ప్రభాస్ కనిపిస్తాడు.

'బాహుబలి' సినిమాతో ప్రభాస్ కెరియర్ గ్రాఫ్ మారిపోయింది. ఆయన క్రేజ్ ఆకాశం హద్దుగా ఎదిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేయడం మొదలైపోయింది. ఆ స్థాయిలో వచ్చిన 'సాహో' సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా ప్రభాస్ తదుపరి సినిమాలపై ఆ పరాజయం ప్రభావం చూపలేకపోయింది. అందువలన పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టులే పట్టాలెక్కుతున్నాయి. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'రాధే శ్యామ్' తరువాత ప్రభాస్ చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్' .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ మూడు కూడా విభిన్నమైన జోనర్లలోనే రూపొందనున్నాయి. ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేయడం పట్ల ఆయన అభిమానులు ఆనందాన్నే వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ ప్రాజెక్టుల కారణంగా సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ పెరిగిపోతుందనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక పెద్ద సినిమా పూర్తయ్యేలోగా ఆయన 'మిర్చి' .. 'మిస్టర్ పెర్ఫెక్ట్' వంటి సినిమాలు చేస్తే బాగుంటుందనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ .. కమలహాసన్ పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తున్నప్పుడు అలాగే చేశారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలకి పచ్చ జెండా ఊపేసిన ప్రభాస్ కి అంత సమయం ఉంటుందా అనేదే సందేహం.