Begin typing your search above and press return to search.

ప్రభాస్-సుజీత్.. అలా ఫిక్సయ్యారు

By:  Tupaki Desk   |   29 Oct 2015 3:30 PM GMT
ప్రభాస్-సుజీత్.. అలా ఫిక్సయ్యారు
X
సినీ పరిశ్రమలో సక్సెస్ వెంటే పరుగులు తీస్తారు అందరూ. ఓ కొత్త దర్శకుడు తొలి సినిమాతో హిట్టు కొట్టాడంటే నిర్మాతలందరూ అతడి వెంట పడతారు. ‘రన్ రాజా రన్’తో అరంగేట్రం చేసిన సుజీత్ వెంట కూడా చాలామంది పడ్డారు. కానీ అతను మాత్రం నేను దర్శకుడు కావడానికి సాయం చేసిన ప్రభాస్ తోనే రెండో సినిమా చేస్తా, అది కూడా తొలి సినిమాను నిర్మించిన యువి క్రియేషన్స్ బేనర్లోనే చేస్తా అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే ఆ సినిమా ఈ పాటికి పూర్తయిపోయి ఉండాలి. కానీ బాహుబలి-1కి బాహుబలి-2కి మధ్య గ్యాప్ లో ఈ సినిమా పూర్తి చేస్తానన్న ప్రభాస్ మాటల నిలబెట్టుకోలేకపోయాడు.

ప్రభాస్ అందుబాటులో లేడు కదా అని వేరే ప్రయత్నాలేమీ చేయకుండా అతడి కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయాడు సుజీత్. అతడి సిన్సియారిటీ నచ్చి.. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ అతడితో సినిమా చేయాలని ఫిక్సయ్యాడట ప్రభాస్. బాహుబలి-2 షూటింగ్ ఈ ఏడాది ఆఖర్లో ఆరంభమవుతుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధానికి ఎలాగైనా షూటింగ్ పూర్తి చేసి.. ద్వితీయార్ధంలో సుజీత్ సినిమా మొదలుపెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నాడట ప్రభాస్. ఈ మేరకు రాజమౌళితో కూడా మాట్లాడి హామీ తీసుకున్నాడట. కాబట్టి వచ్చే ఏడాది ఆగస్టులో సుజీత్-ప్రభాస్ ల సినిమా మొదలయ్యే అవకాశముంది. ఈ లోపు స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దుకోవడం, కొత్త కథల పైనా వర్క్ చేయడంతో కాలక్షేపం చేయబోతున్నాడు సుజీత్. ఐతే మధ్యలో వేరే సినిమా మాత్రం చేయడట.