Begin typing your search above and press return to search.

ప్రభాస్ అవతారం మార్చేది ఎప్పుడంటే..

By:  Tupaki Desk   |   15 Feb 2016 11:30 AM GMT
ప్రభాస్ అవతారం మార్చేది ఎప్పుడంటే..
X
మూడేళ్ల ముందు మొదలైంది ప్రభాస్ ‘బాహుబలి’ ప్రస్థానం. తెలుగులో మరే స్టార్ హీరో చేయని విధంగా ఒక్క సినిమాకే మూడేళ్లు కేటాయించడం.. ఆ తర్వాత దాని సీక్వెల్ కోసం ఇంకో ఏడాదికి పైగా సమయం కేటాయించడం ప్రభాస్‌ కు మాత్రమే చెల్లింది. ఈ నిర్ణయం తప్పని ఒకప్పుడు కొందరు హెచ్చరించినా ప్రభాస్ వెనక్కి తగ్గలేదు. ఆ కష్టానికి, కమిట్మెంటుకి యంగ్ రెబల్ స్టార్ మంచి ఫలితమే అందుకున్నాడు. ‘బాహుబలి’ సినిమాతో దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్నాడు. ఇంకో రెండు మూడు దశాబ్దాలు ఇండస్ట్రీలో కొనసాగినా రాని పేరు.. ఒక్క ‘బాహుబలి’తోనే వచ్చింది. కాబట్టి ఈ మూణ్నాలుగేళ్లలో మంచి కెరీర్ కోల్పోయానని అతను బాధపడాల్సిందేమీ లేదు.

కాకపోతే తన కోసం సుజీత్ లాటి కొందరు దర్శకులు తమ సమయాన్ని వృథా చేసుకుంటుండటమే ఇక్కడ అతడికి కొంచెం బాధ కలిగిస్తుండొచ్చు. ప్రభాస్ తో కమిట్మెంట్ తీసుకున్నాక దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాడు సుజీత్. మధ్యలో వేరే సినిమాలు చేసుకునే అవకాశమున్నా అతను పక్కకు వెళ్లలేదు. బాహుబలి రెండు పార్టుల మధ్య ఈ చిత్రాన్ని లాగించేస్తారని ప్రచారం జరిగింది కానీ.. అది సాధ్యపడలేదు. దీంతో బాహుబలి-2 కూడా పూర్తయ్యాకే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకుని.. ప్రభాస్ సినిమా స్క్రిప్టుకు మెరుగులు దిద్దుతూ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులకు స్క్రిప్టులు రెడీ చేసుకుంటూ గడిపేస్తున్నాడు సుజీత్. ఈ మధ్యే యువి క్రియేషన్స్ వాళ్లు రాజమౌళితో సంప్రదింపులు జరిపి.. సుజీత్-ప్రభాస్ సినిమాకు ముహూర్తం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా మొదలవుతుందట. అక్టోబర్ లోనే ప్రభాస్ పార్టు వరకు షూటింగ్ పూర్తి చేసి అతణ్ని విడుదల చేసేస్తానని జక్కన్న హామీ ఇచ్చాడట. కాబట్టి నవంబర్ లో ప్రభాస్ ను కొత్త అవతారంలో చూడబోతున్నామన్నమాట.