Begin typing your search above and press return to search.

#EMK ః దసరాకు మహేష్‌ దీపావళికి ప్రభాస్‌

By:  Tupaki Desk   |   26 Sep 2021 10:34 AM GMT
#EMK ః దసరాకు మహేష్‌ దీపావళికి ప్రభాస్‌
X
ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు మంచి ఆధరణ లభిస్తోంది. జెమిని టీవీలో టెలికాస్ట్‌ అవుతున్న ఈ షో కు వారం వారం రేటింగ్‌ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు మరింతగా షో పై ఆసక్తి పెంచేందుకు గాను స్టార్స్ ను రంగంలోకి దించుతున్నారు. మొదటి రెండు ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ పాల్గొన్నారు. ఆ రెండు ఎపిసోడ్స్ కు మంచి ఆధరణ దక్కింది. ఆ తర్వాత కొరటాల శివ మరియు రాజమౌళిలు ఈ షో కు గెస్ట్‌ లుగా వచ్చారు. గెస్ట్‌ లు వచ్చిన ఎపిసోడ్స్ కు మంచి రేటింగ్ దక్కుతోంది. అందుకే రెండు వారాలకు ఒకరిని చొప్పున గెస్టులుగా తీసుకు వచ్చేందుకు షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం షో మంచి రేటింగ్ ను దక్కించుకుంటున్న ఈ సమయంలో దసరా ప్రత్యేక ఎపిసోడ్స్ కోసం మహేష్ బాబును గెస్ట్‌ గా తీసుకు వచ్చారు.

ఇప్పటికే మహేష్‌ బాబుతో షూటింగ్‌ ను పూర్తి చేశారు. ఆ విషయాన్ని షో నిర్వాహకులు అధికారికంగా వెళ్లడించలేదు కాని కొన్ని పిక్స్ మాత్రం లీక్ అయ్యాయి. దసరాకు ఖచ్చితంగా ఎవరు మీలో కోటీశ్వరులు లో మహేష్‌ బాబు సందడి చేయడం ఖాయం అంటూ తేలిపోయింది. ఇక ప్రభాస్ ను కూడా రంగంలోకి దించేందుకు గాను జెమిని టీవీ వారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ తనకు ఉన్న పరిచయం మరియు సన్నిహిత్యంతో ప్రభాస్‌ ను ఆహ్వానించడంతో పాటు జెమిని టీవీ వారి నుండి కూడా ప్రభాస్ కు రిక్వెస్ట్‌ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి షో ల్లో ప్రభాస్‌ ఎక్కువగా కనిపించేందుకు ఆసక్తి చూపించడు. కాని ఎన్టీఆర్ వంటి స్టార్‌ హోస్ట్‌ చేస్తుండటంతో పాటు దేశ వ్యాప్తంగా ఆధరణ ఉన్న గేమ్‌ షో కారణంగా ఈ షో కు ప్రభాస్‌ హాజరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ప్రభాస్ ఒక వేళ సమయం ఇస్తే స్పీడ్ గా ఎన్టీఆర్‌ మరియు ప్రభాస్ లతో ఎపిసోడ్‌ ను చిత్రీకరించబోతున్నారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా జెమిని వారు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ మరియు ప్రభాస్ లు షో లో కనిపిస్తే.. గేమ్‌ కలిసి ఆడితే ఆ ఎపిసోడ్‌ కు ఏ స్థాయిలో రేటింగ్ ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ పాన్‌ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌ లతో బిజీ బిజీగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన డేట్లు లభిస్తాయా అంటూ ఇప్పటికే ఆయనతో సినిమాలు కమిట్ అయిన దర్శక నిర్మాతలు వెయిట్‌ చేస్తున్నారు. కనుక ఆయన ఈ షో కు కాస్త సమయం కేటాయిస్తాడా అంటే కొందరు మాత్రం అనుమానమే అంటున్నారు.. మరి కొందరు మాత్రం ప్రభాస్‌ స్నహ స్వభావం కనుక ఖచ్చితంగా అతడిని అడిగితే ఒప్పుకుంటాడు అంటున్నారు. మహేష్‌ బాబును దసరాకు తీసుకు రాబోతున్న జెమిని వారు ప్రభాస్‌ ఒప్పకుంటే దీపావళికి లేదా సంక్రాంతికి తీసుకు వస్తారేమో చూడాలి.