Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ 3డి: తెలుగు డ‌బ్బింగును లైట్ తీస్కోలేదు క‌దా?

By:  Tupaki Desk   |   4 Jun 2023 3:30 PM IST
ఆదిపురుష్ 3డి: తెలుగు డ‌బ్బింగును లైట్ తీస్కోలేదు క‌దా?
X
ఆదిపురుష్ 3డి థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి కేవ‌లం మ‌రో రెండు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ - ఓంరౌత్ బృందం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ముఖ్యంగా ఉత్త‌రాదిన ఈ సినిమాని బ్లాక్ బ‌స్ట‌ర్ చేసేందుకు స‌ర్వ‌శ‌క్తుల‌ను ఒడ్డి ప్ర‌చార‌కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

రామాయ‌ణ ఇతిహాసం ఆధారంగా శ్రీ‌రాముని గొప్ప‌త‌నాన్ని.. సీతాదేవి పాతివృత్యాన్ని.. వాన‌ర సేన‌ల సాయంతో రావ‌ణ్ పై రాముని యుద్ధాల్ని 3డిలో వీక్షించేందుకు ప్ర‌జ‌లంతా ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. అయితే ఆదిపురుష్ టీమ్ చేయ‌కూడ‌ని కొన్ని త‌ప్పులు చేసి అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతోంది. ఇప్ప‌టికే చాలా ప్రచార ట్వీట్లలో తెలుగు భాష విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా త‌ప్పులు రాయ‌డం వాటిపై మీమ్స్ వైర‌ల్ అవ్వ‌డం చూస్తున్నాం. కొన్ని తెలుగు లైన్లు అంటే ఏదైనా సాహిత్యం లేదా క్యాప్షన్ ఇంకేదైనా కావొచ్చు. ఇవ‌న్నీ ఎప్పుడూ త‌ప్పుగా రాస్తున్నారు ఎందుక‌ని?

ఇటీవ‌ల ఓం రౌత్ ట్వీట్ లో శక్తివంతులం.. భక్తివంతులం అనే పంక్తులు తప్పుగా రాయడంతో దానిపై నెటిజ‌నులు పంచ్ లు విసిరారు. హిందీలో క‌రెక్టుగా రాసి తెలుగులో త‌ప్పులు రాయ‌డం స‌రైన‌దేనా? అది త‌ప్పుడు అభిప్రాయాల్ని సృష్టిస్తుంది. ప్ర‌చార ఎత్తుగ‌డ‌లో ఎలాంటి త‌ప్పులు చేసినా ప్ర‌జ‌ల‌కు దొరికిపోవ‌డం సుల‌భం. ఇంత‌కుముందు టీజ‌ర్ విష‌యంలోను ఆదిపురుష్ టీమ్ అలా దొరికిపోయింది. అయితే తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాక ఓంరౌత్ చాలా అలెర్ట‌య్యారు. ట్రైల‌ర్ తో దానిని స‌రిదిద్దేందుకు చాలా నెల‌ల పాటు శ్ర‌మించాల్సొచ్చింది.

ఆదిపురుష్ 3డి కోసం దాదాపు 450కోట్ల మేర బ‌డ్జెట్ పెట్టార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇంత చేసి కూడా డిజిట‌ల్ ప్ర‌చారంలో త‌ప్పులు లేకుండా జాగ్ర‌త్త ప‌డ‌డం లేదు ఎందుక‌నో. సరైన భాషా నిపుణుడిని తెలుగులో పంక్తులు రాసి ఇవ్వ‌మ‌ని అభ్య‌ర్థిస్తే ఎవ‌రైనా కాదని అంటారా? హిందీ - ఇంగ్లీష్ లో వంద‌శాతం క‌రెక్ట్ గా రాసి తెలుగు పంక్తుల్ని లైట్ తీసుకోవ‌డం నిర్ల‌క్ష్యంగానే భావిస్తున్నారు. ఇక హిందీ డ‌బ్బింగ్ పై బాగా దృష్టి పెట్టి పొర‌పాటున తెలుగు డ‌బ్బింగును లైట్ తీస్కోలేదు క‌దా? అనే సందేహం క‌లుగుతోంది. ప్ర‌భాస్ వాయిస్ ఎంతో గంభీరంగా ఉంటుంది. దానిని స‌రైన విధానంలో ఉప‌యోగించుకుంటే శ్రీ‌రామునిలో వీరత్వాన్ని ప్ర‌తిబింబిస్తుంది. సీత పాత్ర‌లో కృతి.. రావణుడి పాత్ర‌లో సైఫ్ బాగానే సెట్ట‌య్యారని ట్రైల‌ర్ వెల్లడించింది.

ఈ పాన్ ఇండియా చిత్రం హిందీలో 500 కోట్లు నెట్ లేదా షేర్ కొల్ల‌గొట్టాలి. తెలుగులో క‌నీసం 200 కోట్లు పైగా షేర్ వ‌సూలు చేయాలి.. ఇరుగు పొరుగునా ఓవ‌ర్సీస్ క‌లుపుకుని ఓవ‌రాల్ గా 300 కోట్లు పైగా తేవాలి. అంటే క‌చ్ఛితంగా డ‌బ్బింగ్ స‌హా ప్ర‌చారం విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌భాస్ రేంజు పాన్ ఇండియాలో అన్ని భాష‌లు క‌లుపుకుని 1000 కోట్లు అంత‌కుమించి. అందువ‌ల్ల ఓంరౌత్ బృందం ఎలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని ఆశిద్దాం.