Begin typing your search above and press return to search.

డైరెక్టర్ కుర్చీకి పవర్ స్టార్ ఇచ్చే గౌరవమే వేరు!

By:  Tupaki Desk   |   28 March 2022 7:00 AM IST
డైరెక్టర్ కుర్చీకి పవర్ స్టార్ ఇచ్చే గౌరవమే వేరు!
X
పవన్ కల్యాణ్ నుంచి ఇటీవల వచ్చిన 'భీమ్లా నాయక్' వసూళ్ల పరంగా థియేటర్లను దడదడలాడించేసింది. చాలా కాలం తరువాత థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపించేలా చేసిన సినిమా ఇది. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - సంభాషణలు సమకూర్చారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. అలాంటి ఈ సినిమా ప్రస్తుతం 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విశేషాలను గురించి సాగర్ కె చంద్ర అభిమానులతో పంచుకున్నారు.

"మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాను రీమేక్ చేయాలని నేను .. సితార వంశీగారు అనుకున్నాము. ఆ తరువాత త్రివిక్రమ్ గారు .. పవన్ సార్ ఎంట్రీ ఇవ్వడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు అందించిన సహయ సహకారాలను మాటల్లో చెప్పలేము .. దానిని నెంబర్లలో కొలిచి చెప్పలేము .. ఈ సినిమాకి ఆయన వెన్నెముక అనడమే కరెక్ట్. మలయాళంలోని కథలో ఫ్లాష్ బ్యాక్ .. క్లైమాక్స్ మార్చడం వలన తెలుగులో పూర్తి కథనే మారిపోయింది. ఇది ఒక కొత్త కథగా తయారైంది. ఈ విషయంలో త్రివిక్రమ్ గారి పాత్ర ముఖ్యమైనది.

పవన్ సార్ ను కలిసి మార్పులు చేర్పులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆయన డైరెక్టర్ కుర్చీకి గౌరవం ఇస్తారు. కథకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన శ్రద్ధగా వింటారు. తన పాత్రకి సంబంధించి కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని అంటారు. ఆయన దగ్గర సినిమాకి సంబంధించిన విషయాలను మాట్లాడటానికి సందేహించవలసిన అవసరం ఉండదు. ఈ సినిమాను నేను పవన్ అభిమానిగానే థియేటర్స్ లో చూశాను. చాలా కాలం తరువాత పవన్ ను అలా చూశామని ప్రేక్షకులు అనడం నాకు ఆనందాన్ని కలిగించింది.

పవన్ తో ఈ సినిమా చేయడం నా కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని .. గర్వాన్ని కలిగించింది. మా నాన్న మెచ్చుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో ఒక సీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఉద్యోగం పోయినవాడివి .. ఓడిపోయినవాడివి అంటూ బస్సులో పవన్ ను రెచ్చగొడుతూ రానా మాట్లాడతాడు. అప్పుడు పవన్ 'మహ్మద్ గజనీ 17 సార్లు ఓడిపోయాడని అంటారు .. మరి గెలిచినవాడి పేరు తెలుసా నీకు?' అనే పవన్ డైలాగ్ నాకు బాగా నచ్చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే నా కెరియర్లో ఈ సినిమా స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే" అని చెప్పుకొచ్చాడు.