Begin typing your search above and press return to search.

పవన్ ని నమ్ముకున్న వాళ్లకు మొండిచెయ్యేనా..?

By:  Tupaki Desk   |   17 Nov 2022 5:00 AM IST
పవన్ ని నమ్ముకున్న వాళ్లకు మొండిచెయ్యేనా..?
X
రాజకీయాల కోసం కొన్నాళ్ళు సినిమాలకు దూరమైన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. 'వకీల్ సాబ్' చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తుండటంతో తమ హీరోని ఎక్కువ సినిమాలలో చూడొచ్చని ఎంతో సంతోషించారు. కానీ పరిస్థితులు మాత్రం దీనికి సహకరించలేదు. ఎప్పటికప్పుడు పవన్ ప్రాధాన్యత క్రమం మారుతుండటంతో ఆశించిన సినిమాలేవీ పూర్తవ్వలేదు.

పవన్ కళ్యాణ్ వస్తూ వస్తూనే మూడు నాలుగు ప్రాజెక్ట్స్ కి కమిట్మెంట్ ఇచ్చి అడ్వాన్సులు తీసుకున్నారు. ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మాణంలో 'హరి హర వీరమల్లు' అనే మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' మరియు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ చిత్రానికి ప్రకటన వచ్చింది.

అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ వారి 'భీమ్లా నాయక్' మూవీ ముందుకు రావడంతో పవన్ కళ్యాణ్ లైనప్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. మిగతా చిత్రాలను ఆలస్యం చేస్తూ.. తన సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించిన రీమేక్ సినిమాని కంప్లీట్ చేసారు. మధ్యలో పాండమిక్ వచ్చి ప్లాన్స్ పై దెబ్బేసింది. దీంతో వీరమల్లు హోల్డ్ లో పడిపోయింది.. భవదీయుడు ప్రకటనకే పరిమితమైంది. సురేందర్ రెడ్డి చిత్రాన్ని మొత్తానికే మరిచిపోయేలా చేసింది.

'భీమ్లా నాయక్' తర్వాత పవన్ అప్పుడెప్పుడో సెట్స్ మీదకు తీసుకొచ్చిన క్రిష్ సినిమా మరియు రెండేళ్ల క్రితమే అనౌన్స్ చేసిన హరీష్ శంకర్ చిత్రాల షూటింగ్స్ ని సమాంతరంగా పూర్తి చేస్తారని అందరూ భావించారు. అలాంటి సమయంలో సముద్ర ఖని దర్శకత్వంలో 'వినోదం సీతం' రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. అలానే యువ దర్శకుడు సుజీత్ చెప్పిన స్టోరీని ఓకే చేసినట్లు టాక్ ఉంది.

కానీ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలను బ్యాలన్స్ చేసే క్రమంలో ఏదీ అనుకున్న విధంగా జరగలేదు. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆల్రెడీ కమిటైన చిత్రాలను ఇంకెప్పుడు ఫినిష్ చేస్తారనే సందేహాలు అందరిలో కలిగాయి. ఈ నేపథ్యంలో 'హరి హర వీరమల్లు' సినిమా కోసం డేట్స్ కేటాయించిన పవన్.. ఇటీవల తిరిగి సెట్స్ లో అడుగుపెట్టాడు. అక్టోబర్ లోనే చుట్టేద్దాం అనుకున్న షెడ్యూల్ కాస్తా లేట్ అయింది.

పవన్ ప్రాధాన్యత - డేట్స్ ని పరిగణలోకి తీసుకుంటే వీలైనంత త్వరగా HHVM షూటింగ్‌ పూర్తి చేయడం కష్టమైన పని. అందులోనూ ఇది పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసిన  పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఎలా అనుకున్నా మరో మూడు నాలుగు నెలల సమయం పట్టొచ్చు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ ఎన్నికల కంటే ముందు ఒక్క క్రిష్ చిత్రాన్ని మాత్రం కంప్లీట్ చేయగలడు.

రెండు పడవల మీద ప్రయాణం అంటే రెండిటికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి.. పవన్ వచ్చే ఏడాది నుంచి కంప్లీట్ గా పాలిటిక్స్ మీదనే ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న ఫిలిం మేకర్స్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్ చాలాకాలంగా మరో సినిమా చేయకుండా పవర్ స్టార్ కోసం వేచి చూస్తున్నాడు. సుజీత్ కూడా ఆయన స్క్రిప్ట్ మీదనే వర్క్ చేస్తున్నాడని అంటున్నారు.

నిర్మాతలు కూడా పవన్ డేట్స్ ఇస్తే సెట్స్ మీదకు వెళ్లాలని సన్నాహాలు చేసుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే అగ్ర హీరో ఇప్పుడు ఒక్క సినిమానే పూర్తి చేసేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మిగతా ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్  వారికి అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. కుదిరితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.