Begin typing your search above and press return to search.

'జై భీమ్' నుంచి దుమ్మురేపేస్తున్న పవర్ సాంగ్!

By:  Tupaki Desk   |   19 Oct 2021 3:31 AM GMT
జై భీమ్ నుంచి దుమ్మురేపేస్తున్న పవర్ సాంగ్!
X
తమిళనాట కమల్ .. విక్రమ్ తరువాత కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే కథానాయకుడిగా సూర్య కనిపిస్తాడు. థియేటర్ కి వెళ్లిన తన సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకున్నా, దాని గురించే ఆలోచిస్తూ కూర్చోవడం ఆయనకి అలవాటు లేదు. సాధ్యమైనంత త్వరగా మరో ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లిపోతుంటాడు. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకున్నప్పుడు అవసరమైతే తనే నిర్మాతగా మారిపోతుంటాడు. అలా ఆయన చేసిన 'ఆకాశం నీ హద్దురా', అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా కోట్లాదిమందికి చేరువైంది. హిట్ తో పాటు సూర్యకి ప్రశంసలను తెచ్చిపెట్టింది.

ఈ సారి కూడా ఆయన తన సొంత బ్యానర్ పై ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించాడు .. ఆ సినిమానే 'జై భీమ్'. ఇది ఆటపాటలతో సాగే కమర్షియల్ కథ కాదు .. కొన్ని జీవితాలను కథగా చెప్పే ప్రయత్నమని సూర్యనే చెప్పాడు. సామాజిక పరమైన అసమానతను వ్యతిరేకిస్తూ, సమానత్వం కోసం ఒక అడ్వకేట్ చేసే చట్టపరమైన పోరాటమే ఈ సినిమా కథ. యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందినట్టుగా చెబుతున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమాను నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా 'పవర్' అంటూ సాగే ఒక పాటను వదిలారు. ఇలా ఈ పాటను వదిలారో లేదో .. అలా దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఈ పాటకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది. "ముందుకు వెళ్లడానికి మరో మార్గం లేనప్పుడు .. మరో అవకాశం లేనప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేయి. పవర్ ను నీ చేతిలోకి తీసుకో .. పవర్ ఉన్నప్పుడే తల ఎత్తుకుని బ్రతకడానికి అవకాశం ఉంటుంది" అనే అర్థంలో ఈ పాట సాగుతోంది. సీన్ రోల్డన్ కంపోజ్ చేసిన ఈ పాటకి అరివు సాహిత్యాన్ని అందించడమే కాకుండా తానే ఆలపించాడు.

ఫాస్టు బీట్ గా ట్యూన్ చేయబడిన ఈ పాట ఉత్తేజాన్ని రేకెత్తిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒక అడ్వకేట్ గా తన ముందున్న దారి ఒకటే అయినప్పుడు తాను ఏం చేయాలి? అనే ఒక ఆలోచనలో ఉన్న సూర్య విజువల్స్ పై సాగే ఈ పాట సినిమాపై ఆసక్తిని పెంచేదిలానే ఉంది. సూర్య ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. రజీషా విజయన్ .. మణికందన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి తెలుగు .. తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా, ఏ స్థాయికి వీక్షకులకు కనెక్ట్ అవుతుందో చూడాలి.