Begin typing your search above and press return to search.

పోసాని మరో ఆపరేషన్‌..!

By:  Tupaki Desk   |   3 Jan 2019 12:02 PM GMT
పోసాని మరో ఆపరేషన్‌..!
X
సంచలనాలకు మారు పేరుగా నిలిచే పోసాని కృష్ణ మురళి గత కొన్ని రోజులుగా బుల్లి తెరపై యాంకర్‌ గా మరియు అప్పుడప్పుడు సినిమాల్లో కామెడీ రోల్స్‌ లో కనిపిస్తూ వస్తున్నాడు. రచయితగా దర్శకుడిగా అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్న పోసాని ఆ రెంటిని వదిలి చాలా కాలం అయ్యింది. మళ్లీ ఇప్పుడు దర్శకుడిగా ఒక చిత్రం చేసేందుకు పోసాని సిద్దం అయ్యాడు. అందుకోసం స్క్రిప్ట్‌ ను కూడా సిద్దం చేసి పెట్టాడు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడి కాబోతున్నాయి.

గతంలో ఆపరేషన్‌ దుర్యోదన అంటూ ఒక సంచలన మూవీని తెరకెక్కించి పొలిటికల్‌ పంచ్‌ విసిరిన పోసారి మరోసారి అదే తరహాలో ఒక పొలిటికల్‌ మూవీని తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరియు దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగబోతున్న సమయంలో ఆ సినిమాను విడుదల చేయాలని పోసాని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకోసం పక్కా షెడ్యూల్‌ ను కూడా ప్లాన్‌ చేశాడు. సినిమాను మే లో విడుదల చేసేలా చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

సినిమా మొత్తం సింగిల్‌ షెడ్యూల్‌ లో పూర్తి చేయనున్నాడట. ఈ చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఏపీ రాజకీయాలను టార్గెట్‌ చేస్తూ ఈ సినిమా ఉంటుందని కూడా కొందరు అంటున్నారు. రాజకీయాల్లో ఆమద్య క్రియాశీలకంగా ఉన్న పోసాని ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కూడా అప్పుడప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ విమర్శలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడన్నమాట. మరి పోసాని ఈ ఆపరేషన్‌ ఏమేరకు సక్సెస్‌ అయ్యేనో చూడాలి.