Begin typing your search above and press return to search.

నా సపోర్ట్ వైఎస్సార్ సీపీకే-పోసాని

By:  Tupaki Desk   |   17 Sept 2017 5:08 PM IST
నా సపోర్ట్ వైఎస్సార్ సీపీకే-పోసాని
X
సినిమా విషయాలైనా.. రాజకీయ పరమైన అంశాలైనా.. ఇంకే విషయాలైనా పోసాని కృష్ణమురళి ముక్కుసూటిగా మాట్లాడతాడు. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబుతాడు. ప్రస్తుత రాజకీయాలపైనా ఆయన అలాగే స్పందించారు. ఒకానొనక దశలో తెలుగుదేశం పార్టీగా మాట్లాడిన పోసాని.. ఆ తర్వాత ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఐతే ఇప్పుడు మాత్రం తన మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అని చెబుతున్నారాయన. ఇందుకు ఆయన కారణాలేంటో కూడా చెప్పారు. ‘‘నాకు తెలిసిన.. నేను చూసిన రాజకీయ వ్యవస్థలో ఆత్మాభిమానం ఒక్క శాతం కూడా చంపుకోకుండా.. ఆత్మగౌరవాన్ని ఒక్క శాతం కూడా పోగొట్టుకోకుండా.. ఎవరికీ తల వంచకుండా బతికిన రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి గారు. ఆయనంటే నాకెంతో గౌరవం.. ప్రేమ. అదే ప్రేమ ఆయన కుమారుడు జగన్‌ మీద ఉంది. అందుకే నా సపోర్ట్‌ వైఎస్సార్‌ సీపీకే.

ఇక తన రాజకీయ ప్రస్థానం గురించి పోసాని మాట్లాడుతూ.. ‘‘నాగార్జున యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో జనరల్‌ సెక్రటరీగా పెద్ద మెజారిటీతో గెలిచాను. 1983లో తెలుగు దేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది. ఐతే అప్పటికి మా నాన్న చనిపోయారు. ఆ బాధలో ఉన్నాను. వేరే దేని మీదా దృష్టి లేదు. నాకప్పటికి రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. ఇక 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిలకలూరి పేట నియోజక వర్గం నుంచి పోటీ చేశా. ప్రత్యర్థులు కోట్లు ఖర్చు పెట్టారు. ఓటర్లే అన్నారు మీరు డబ్బు ఖర్చుపెట్టకపోతే ఓడిపోతారని. నేను ఖర్చుపెట్టనని తెగేసి చెప్పా. మందు తాగించాలన్నారు. నేను తాగను. మీతో తాగించను అన్నాను. నేను చెడిపోతే చిలకలూరిపేట మొత్తం తినేస్తా.. కావాలంటే ఓడించండి అన్నా. ఆ ఎన్నికల్లో జెండాలు నావే. జీపులు నావే. అందరికీ పెట్టించిన భోజనాల ఖర్చూ నాదే. చిరంజీవి గారిని ఒక్క పైసా అడగకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాను’’ అని పోసాని చెప్పాడు.