Begin typing your search above and press return to search.

పోసాని మాట: ఎన్టీఆర్ పై సినిమా వద్దు

By:  Tupaki Desk   |   5 July 2017 7:42 AM GMT
పోసాని మాట: ఎన్టీఆర్ పై సినిమా వద్దు
X
ఇప్పుడు తెలుగు వాళ్లందరికీ ఒకటే హాట్ టాపిక్. అదే.. ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ మీద తాను సినిమా తీయబోతున్నట్లుగా రామ్ గోపాల్ వర్మ నిన్న ప్రకటించినప్పటి నుంచి అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. వర్మ ఏం తీస్తాడు.. ఏం దాస్తాడు.. ఈ సినిమాలో ఎవరినెలా ప్రొజెక్ట్ చేస్తాడని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఐతే టాపిక్ ఏదైనా ముక్కుసూటిగా.. మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పే పోసాని కృష్ణమురళి మాత్రం ఎన్టీఆర్ మీద సినిమా వద్దే వద్దంటున్నారు. ఎన్టీఆర్ ను ఎంతో అభిమానించే వ్యక్తిగా తన లాంటి వాళ్లు ఆయన మీద సినిమా తీయొద్దనే కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎన్టీఆర్ మీద సినిమా తీయకపోవడమే పెద్దాయనకు ఇచ్చే గౌరవం అని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఆయన రీజనింగ్ ఏంటో తెలుసుకుందాం పదండి.

‘‘ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర తీయకుండా వదిలేస్తే ఆయన గౌరవాన్ని కాపాడిన వాళ్లమవుతాం. ఆయన ఆత్మ క్షోభించకుండా ఉండాలంటే సినిమా తీయకపోవడం మంచిది. ఎన్టీఆర్ గారిని టచ్ చేయకపోతే ఆయనకు మేలు చేసిన వాళ్లమవుతాం. రామారావు గారి జీవితాన్ని మూడు రకాలుగా విభజించాలి. సినిమా జీవితం.. రాజకీయ జీవితం.. వ్యక్తిగత జీవితం. ఈ మూడింట్లో దేని విషయంలో అయినా మనం నిజాలు చెప్పాలనుకుంటే వేరే వాళ్లను అవమానించాలి. అన్ పాపులర్ చేయాలి. తప్పు పట్టాలి. రామారావుగారి కుటుంబానికి అది మంచిది కాదు. ఆయన్ని ప్రేమించే వాళ్లకు కూడా అది మంచిదికాదు.

ఉదాహరణకు ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని తీసుకుంటే.. ఆయన పార్టీ పెట్టిన తర్వాత అప్పటికి కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు సీటిస్తే ఎన్టీఆర్ మీద పోటీ చేసి గెలుస్తా అన్నారు. కానీ తర్వాత ఎన్నికల్లో ఓడి.. అదే రామారావుగారి పార్టీలో చేరారు. కారణం ఏదైనా కానివ్వండి. తర్వాత ఎన్టీఆర్ గారు పెట్టుకున్న పార్టీ నుంచి ఆయన్ని వెళ్లగొట్టారు. ఈ విషయాలన్నీ సినిమాలో చూపించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ మీద చెప్పులు వేశారు. ఎవరు వేశారు.. ఎవరు వేయించారు.. అన్నది ప్రజలకు తెలుసు.. కుటుంబ సభ్యులకు తెలుసు. నిజాయితీగా ఇవన్నీ తెరమీద చూపించడం సంభవమా.. సమంజసమా.. సంస్కారమా.. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి? రామారావు గారి కుటుంబ సభ్యుల్ని బ్లేమ్ చేయాలి. అది మంచిది కాదు. వాళ్లను బాధపెట్టడం సరి కాదు. అలాగే నిజాలు చెబుతూ పోతే.. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు గారిని బాధపెట్టాలి. బయోపిక్ తీస్తే అన్నీ కెలకాలి. మరణం గురించి యాజిటీజ్ గా చెప్పాలి. బాలకృష్ణ గారికి ఇది అవసరం లేదు. అందుకే ఎన్టీఆర్ జీవితాన్ని ముట్టుకోవడం దేనికి అంటాను.

ఎన్టీఆర్ సింహం.. ఆయన చాలా గొప్పోడు అని చెబితే సరిపోదు. ఆయన ఎలా బాధపడ్డాడు.. ఎలా కన్నీళ్లు పెట్టుకున్నాడు.. చంద్రబాబు గురించి ఎలా చెప్పాడు.. ఇంటర్వ్యూల్లో ఏమన్నాడు.. అవన్నీ చెప్పాలి. అవన్నీ చెప్పి చనిపోయిన మనిషిని మళ్లీ మళ్లీ చంపడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. అలాగే ఇప్పుడున్న చాలామందిని బాధపెట్టాల్సి ఉంటుంది అది కరెక్ట్ కాదు. ఇవన్నీ కాకుండా ఎన్టీఆర్ గొప్పదనాన్నే చెబితే అది జనాలకు అవసరం లేదు. ఆయనేంటో అందరికీ తెలుసు. పై విషయాన్ని పరిహరించి సినిమా తీస్తే అది బాలయ్యకే అగౌరవం. ఎన్టీఆర్ మీద సినిమా తీసుకునే హక్కు బాలయ్యకు ఉంది. వర్మకు ఉంది. ఎవరికైనా ఉంది. దాన్ని నేను కాదనలేదు. ఆయన వంగవీటి సినిమా తీశారు. చాలా విమర్శలొచ్చాయి. తన తండ్రి గురించి సరిగ్గా చెప్పలేదని రాధ అన్నారు. ఇలాంటి సినిమాలు తీసినపుడు రెండు వైపులా బ్యాలెన్స్ చేయడం కుదరదు. ఏదో ఒకవైపు మొగ్గాలి. ఇంకొకరిని బాధపెట్టాలి. అందుకే ఎన్టీఆర్ గారిని ఎంతో అభిమానించే వ్యక్తిగా ఈ సినిమా వద్దని అనుకుంటా. వర్మకు ఎన్టీఆర్ గురించి తెలియకపోతే ఏదైనా చెప్పేవాడిని. ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి కామెంట్ చేయను. ఎన్టీఆర్ సినిమా తీయకపోతే వచ్చే నష్టమేమీ లేదు. ఆయన గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇంకా ఆయన మీద ప్రేమ ఉంటే ఢిల్లీలో కూర్చుని భారతరత్న ఇప్పించండి. పాదాభివందనం చేస్తా’’ అని పోసాని ముగించారు.