Begin typing your search above and press return to search.

జాను: ఆ మూడే కొంప ముంచాయా?

By:  Tupaki Desk   |   10 Feb 2020 3:00 PM GMT
జాను: ఆ మూడే కొంప ముంచాయా?
X
కొన్ని సినిమాల ఫలితం ఎలా ఉండబోతోందనేది చూచాయగా ముందే తెలుస్తుంది. ఫిలిం యూనిట్ ప్రమోషన్స్ చేసే తీరు.. ప్రోమోస్.. టీమ్ ఉత్సాహాన్ని బట్టి సినిమాపై బజ్ ఏర్పడుతుంది. ఈ శుక్రవారం విడుదలైన 'జాను' సినిమాపై కూడా రిలీజుకు ముందు బజ్ లేని పరిస్థితే కనిపించింది. పెద్దగా హిట్ కాని ఆడియో.. డల్ ప్రమోషన్స్ తో సినిమాకు బజ్ ఏర్పడలేదు. సమంతా లాంటి స్టార్ హీరోయిన్.. శర్వానంద్ లాంటి హీరో ఉన్నప్పటికీ సినిమాకు బజ్ రాకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

'అల వైకుంఠపురములో'.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల ప్రమోషన్స్ ఏ స్థాయిలో చేశారో అందరికీ తెలుసు. బడా స్టార్ హీరోలు అయినప్పటికీ ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా మూడు నెలల ముందే ప్రచారం మొదలు పెట్టారు. దానికి తగ్గట్టే సినిమాలపై బజ్ పీక్స్ లో కనిపించింది. ఇక 'జాను' విషయం మాత్రం పూర్తి విరుద్ధం. క్రేజ్ లేక పోవడం తో మొదటి రోజు కలెక్షన్లు.. మొదటి వారాంతం కలెక్షన్లు నామ మాత్రంగానే ఉన్నాయి. సినిమాకు దాదాపు రూ.21 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిన సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ చాలా ముఖ్యం. ఫుల్ రన్ లో వసూళ్లు ఎలా ఉండబోతున్నాయో ఓపెనింగ్స్ చూస్తేనే అర్థం అవుతుందని ట్రేడ్ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు.

'జాను' రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా కాదు. నెమ్మదిగా సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. మెజారిటీ తెలుగు ప్రేక్షకులకు ఇంత స్లో నరేషన్ నచ్చదు. బజ్ లేక పోవడంతో పాటు స్లో నరేషన్ కూడా తోడవడం తో ఎక్కువ మందికి కనెక్ట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్లాసిక్ సినిమా ను రీమేక్ చేసినప్పటికీ ఆ కంటెంట్ ను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోవడంతో బజ్ ఏర్పడలేదు. ప్రమోషన్స్ సరిగా చెయ్యక పోవడం.. వీక్ ఆడియో.. స్లో నరేషన్.. ఈ మూడే 'జాను' కు ప్రతికూలంగా మారాయని అంటున్నారు.