Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 2 వైపు పూనమ్ అడుగులు?

By:  Tupaki Desk   |   26 May 2018 8:56 AM GMT
బిగ్ బాస్ 2 వైపు పూనమ్ అడుగులు?
X
తెలుగు టీవీ ఛానల్స్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బిగ్ బాస్ సీజన్ 2 యాంకర్ నాని అని అఫీషియల్ గా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు అందరి కన్ను పార్టిసిపెంట్స్ మీద పడింది. నిజానికి ఈ షో రక్తి కట్టడంలో యాంకర్ పాత్ర చాలా పరిమితం. వీక్ ఎండ్ లో కేవలం రెండు రోజులు బాధ్యత తీసుకుంటే మిగిలిన ఐదు రోజులు ప్రేక్షకులు షోకు అతుక్కుపోయేలా చేయాలంటే మాత్రం అది పార్టిసిపెంట్స్ భుజాల మీదే ఉంటుంది. అందుకే వీలైనంత వివాదాలు ఉండేలా ప్లాన్ చేస్తుంటారు నిర్వాహకులు. ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ టేకప్ చేసాడు కాబట్టి ఎక్కువ మసాలా లేకుండా జాగ్రత్త పడ్డారు. అదే హిందీలో చూసుకుంటే సల్మాన్ ఖాన్ అండతో షోలో జరిగే రచ్చ మామూలుగా ఉండదు. హద్దు అనేది పూర్తిగా మర్చిపోయి మరీ ప్రవర్తిస్తుంటారు పార్టిసిపెంట్స్. అందుకే కాబోలు నానితో చేయించిన ప్రోమోలో అదే పనిగా ఈసారి మసాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పించారు.

ఇక ఒక్కొక్కరిగా ఇందులో పేర్లు బయటికి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు కత్తి మహేష్ కు మధ్య జరిగిన వివాదంలో లైమ్ లైట్ లోకి వచ్చిన పూనమ్ కౌర్ ని తీసుకునే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్టు టాక్. ఒకవేళ అదే కనక జరిగితే నిజంగానే స్పైస్ తోడైనట్టే. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నేరుగా పేర్లు ప్రస్తావించకుండా హీరోలను దర్శకులను టార్గెట్ చేసి కౌంటర్లు వేస్తున్న పూనమ్ ఇంత గ్యాప్ తర్వాత వెలుగులోకి వచ్చే ప్రయత్నాన్ని వదులుకుంటుంది అనుకోలేం. పైగా చేనేత బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న పూనమ్ కనక షోలో పాల్గొంటే పవన్ మీద తన అభిమానం లేదా ఇంకేదైనా ఎమోషన్ గురించి పంచుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయని ఫాన్స్ ఆశిస్తున్నారు. దాంతో పాటు ఈ మధ్య ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ ను ఉద్దేశించినట్టుగా పెడుతున్న మెసేజెస్ గురించి ఏదైనా ప్రస్తావన ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ జరిగేది పూనమ్ సెలెక్ట్ అయితేనే సుమా.