Begin typing your search above and press return to search.

మెగా హీరోల సరసన మెరుస్తున్న పూజ హెగ్డే!

By:  Tupaki Desk   |   5 Sept 2021 5:00 AM IST
మెగా హీరోల సరసన మెరుస్తున్న పూజ హెగ్డే!
X
పూజ హెగ్డే .. పడుచు గుండెల్లో ఈ పేరు సృష్టిస్తున్న సందడి .. అందాలతో చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. సన్నజాజులు పోగుచేసినట్టు .. కాడ మల్లెలు రాశి పోసినట్టుగా ఈ సుందరి కనిపిస్తుంది. ఆమె నడుస్తుంటే నదిలో అల కదిలినట్టుగా అనిపిస్తుంది .. పిలగాళ్ల చెవులకు ఆమె నవ్వు వేయి వేణువుల గానమై వినిపిస్తుంది. తామరాకుపై తమలపాకులా లేతగా కనిపించే ఈ బ్యూటీకి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందం .. అభినయం రెండూ ఉన్న ఈ పిల్లను అదృష్టానికి పర్యాయపదంగా చెప్పుకుంటారు.

నిజంగా అదృష్టమే లేకపోతే మెగా హీరోల జోడీగా ఇంతగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయా? ఆ సినిమాల వెనుకే విజయాలు క్యూ కడతాయా? వరుణ్ తేజ్ తో ఈ అమ్మాయి 'ముకుంద' .. 'గద్దలకొండ గణేశ్' చేసింది. రెండవ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ''ఎల్లువచ్చే గోదారమ్మా' అంటూ శ్రీదేవి రేంజ్ లో ఈ సిరిమల్లె రెచ్చిపోయింది. ఇక అల్లు అర్జున్ కాంబినేషన్లో చేసిన 'దువ్వాడ జగన్నాథం'లో ఈ పిల్ల వయ్యారంతో కూడిన అందాలను వడియాల్లా ఆరబోసేసింది. 'అలా వైకుంఠపురములో' సినిమాతో 'బుట్టబొమ్మలా హృదయాలను అల్లుకుపోయింది .. అలుముకుపోయింది.

ఇక చరణ్ 'రంగస్థలం' సినిమాలో ఐటమ్ సాంగ్ లో సందడి చేసిన పూజ, 'ఆచార్య సినిమాలో ఆయన సరసన నాయికగా అలరించనుంది. చరణ్ సరసన పూర్తిస్థాయిలో జిగేలురాణిని చూడటానికి యూత్ అంతా ఏకమై 'ఆచార్య' సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముందుగా మెగా హీరోలను కవర్ చేద్దాం అన్నట్టుగా దూసుకుపోతున్న ఈ పిల్ల పవన్ జోడీగా కనువిందు చేసేది ఎప్పుడా అని అంతా ఆత్రుతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ దానిని కూడా భర్తీ చేసేసింది. హరీశ్ శంకర్ సినిమాలో పవన్ సరసన ఆమెకి చోటు దొరికినట్టుగా చెబుతున్నారు.

తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన తరువాత బాలీవుడ్ కి వెళ్లిన పూజ, అక్కడ పరాజయం ఎదురుకావడంతో, పరుగెత్తుకుంటూ మళ్లీ టాలీవుడ్ కి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఆమెను 'దువ్వాడ జగన్నాథం' సినిమానే ఆదుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందించి ఆమె కెరియర్ గాడిలో పడేలా చేసింది. అప్పటి నుంచి ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకుడనే విషయం తెలిసిందే. పవన్ సరసన ఛాన్స్ అనగానే ఇక ఆమె ఎంతమాత్రం ఆలోచన చేయకుండా ఈ సినిమా ఒప్పుకుందని అంటున్నారు. అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుంది మరి.