Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కావాల్సింది... కానీ?

By:  Tupaki Desk   |   17 Jan 2016 1:30 PM GMT
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కావాల్సింది... కానీ?
X
పూజా హెగ్డే గుర్తుందా? అదేనండీ మజ్ను నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ అంటూ ఓ అమ్మాయి కోసం వెతికాడే.. ‘ముకుంద’ వరుణ్ తేజ్ కోసం గోపికమ్మా అంటూ పాటందుకుందే ఆ అమ్మాయేనండీ బాబూ. టాలీవుడ్లో చేసిన రెండు సినిమాలతో మంచి పేరు సంపాదించిన ఈ ముంబయి భామ తెలుగులో మంచి మంచి అవకాశాల్ని కాదనుకుని.. హృతిక్ రోషన్ సినిమా ‘మొహెంజదారో’ కోసం బాలీవుడ్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

అశుతోష్ గోవారికర్ లాంటి పెద్ద దర్శకుడితో హృతిక్ లాంటి స్టార్ హీరోతో సినిమా అంటే గొప్ప అవకాశమే కానీ.. దాని కోసం రెండు మూడేళ్ల కెరీర్ ను త్యాగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని సందేహం వ్యక్తం చేశారు అందరూ. కానీ పూజా అవేమీ పట్టించుకోకుండా ఆ సినిమాకే అంకితమైపోయింది. ఐతే ఏడాదిన్నర ముందు మొదలైన ఈ సినిమా ఇప్పటికీ పూర్తవలేదు. ఈ ఏడాది ఆఖరుకు కూడా పూర్తవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు.

ఇప్పటికే ఒకసారి హృతిక్ గాయపడటంతో షూటింగుకి బ్రేక్ పడింది. దాదాపు నెల రోజులు షూటింగుకి అతను దూరమవడంతో అందరి డేట్లు వృథా అయ్యాయి. షెడ్యూళ్లన్నీ డిస్టర్బ్ అయ్యాయి. తాజాగా అతను మరోసారి షూటింగులో గాయపడ్డాడు. రెస్ట్ తీసుకుంటున్నాడు. మళ్లీ ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉండదు. ఈ వృథా అయ్యే డేట్లను సర్దుబాటు చేసి మళ్లీ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేయడమంటే చిన్న విషయం కాదు. ఇప్పటికే షూటింగు అనుకున్న ప్రకారం సాగక.. సినిమా బాగా ఆలస్యమవుతోంది.

ఓ హీరో ఎంత కాలం ఇలా ఒక సినిమాకే అంకితమైపోయినా పర్లేదు. కానీ హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువ. వాళ్ల కెరీర్లో విలువైన సంవత్సరాలు ఇలా వృథా అయిపోతే చాలా కష్టం. కాస్త వయసు మీద పడ్డాక అవకాశాలు రావు. కాజల్ - సమంత - తమన్నా లాంటి హీరోయిన్ల జోరు తగ్గిపోతున్న టైంలో మన నిర్మాతలకు మంచి ఛాయిస్ లాగా కనిపించింది పూజా. ఓ స్టార్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న పూ.. ఇక్కడే కంటిన్యూ అయి ఉంటే ఈపాటికి కచ్చితంగా మంచి రేంజికి వెళ్లేదే. కానీ ఆమె ‘మొహెంజదారో’ అంకితమైపోయింది. ఇది మంచి నిర్ణయమా కాదా అన్నది సినిమా విడుదలయ్యాక కానీ తెలియదేమో.