Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే ఆవిష్కరించిన 'అనుభవించు రాజా' లోని లవ్లీ సాంగ్..!

By:  Tupaki Desk   |   8 Nov 2021 11:30 AM GMT
పూజా హెగ్డే ఆవిష్కరించిన అనుభవించు రాజా లోని లవ్లీ సాంగ్..!
X
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''అనుభవించు రాజా''. ఇందులో కాశిష్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ని నవంబర్ 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

కింగ్ అక్కినేని నాగార్జున 'అనుభవించు రాజా' ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్ ని విడుదల చేశారు. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. ఈరోజు సోమవారం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే 'నీవల్లే రా' అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోని ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. 'ఏంటో.. నిను తలచి తలచి, కనులు తెరిచి కలగంటున్నా.. ఏంటో.. నువు ఎదురు పడితే ఎదని అదుపు చేయలేకున్నా.. నీవల్లే రా' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.

రాజ్ తరుణ్ ను పిచ్చిగా ప్రేమిస్తున్న కాశీష్ ఖాన్.. ఆనందంతో గెంతుతూ డ్యాన్స్ చేస్తూ పాడుకోవడాన్ని ఈ సాంగ్ లో చూడవచ్చు. ఇందులో కాశీష్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ అలరిస్తున్నాయి. గోపీ సుందర్ ఈ ఫుట్‌ ట్యాపింగ్ నంబర్‌ కు ట్యూన్ కంపోజ్ చేశారు. తొలిసారి ప్రేమలో పడిన ఓ యువతి తన మనసులో ఉన్న భావాలను గందరగోళాన్ని తెలియజేసేలా గేయ రచయిత భాస్కరభట్ల 'నీవల్లే రా' పాటకు సాహిత్యం అందించారు. యువ గాయని రమ్య బెహరా తనదైన శైలిలో ఈ గీతాన్ని ఆలపించారు. విజయ్ బిన్నీ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు.

సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ''అనుభవించు రాజా'' చిత్రానికి నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందించగా.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేశారు. సుప్రియా బట్టేపాటి - రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్స్ గా వ్యవహరించారు. రియల్ సతీష్ ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి - ఆడుకాలమ్ నరేన్ - అజయ్ - సుదర్శన్ - టెంపర్ వంశీ - ఆదర్శ్ బాలకృష్ణ - రవి కృష్ణ - భూపాల్ రాజు - అరియానా తదితరులు ఇతర పాత్రలు పోషించారు.