Begin typing your search above and press return to search.

తమిళ్ 'బాహుబలి' తెలుగు లో కష్టమే..!

By:  Tupaki Desk   |   4 Aug 2022 2:30 AM GMT
తమిళ్ బాహుబలి తెలుగు లో కష్టమే..!
X
బాహుబలి సినిమా అనేది ఇండియన్ సినిమా పరిశ్రమకు ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్‌ చేసింది. అన్ని భాషల్లో కూడా ఇప్పుడు తాము బాహుబలి రేంజ్ సినిమా ను తీస్తున్నాం.. చేయబోతున్నాం.. చేస్తాం అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమిళ్‌ లెజెండ్‌ డైరెక్టర్‌ అయిన మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ ను తమిళ్‌ బాహుబలి అంటూ అక్కడి మీడియా పేర్కొంటూ కథనాలు రాస్తోంది.

తమిళ్ సినీ ఇండస్ట్రీలో రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్ కు కచ్చితంగా బాహుబలి రేంజ్ ను అందుకునే స్థాయి ఉందని.. రెండు పార్ట్‌ లు కలిపి బాహుబలి వసూళ్లను బీట్ చేయడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా అక్కడ ప్రచారం జోరుగా సాగుతుంది. ఒక్క తమిళనాడు లేదా కేరళ లో సినిమా ఆడితే బాహుబలి రేంజ్ వసూళ్లు కాదు కదా కనీసం అందులో సగం కూడా నమోదు అయ్యే అవకాశం లేదు.

పొన్నియన్ సెల్వన్ ను ఇప్పటి నుంచే ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. సెప్టెంబర్‌ 30న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లు.. పాటలు.. చిన్న చిన్న వీడియో బిట్స్ ను విడుదల చేస్తూ సినిమా పై అంచనాలు పెంచే ప్రయత్నం ను మణిరత్నం టీమ్ చేస్తున్నారు.

సినిమా నుండి విడుదల అవుతున్న పబ్లిసిటీ స్టఫ్‌ తెలుగు ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలు రోజు రోజుకు తగ్గేలా చేస్తోంది. మొదట పోస్టర్ విడుదల అయిన సమయంలో త్రిష లుక్‌.. ఐశ్వర్య రాయ్ గెటప్‌.. ఇతర నటీ నటుల లుక్‌ కు తెలుగు ప్రేక్షకులు నోరు వెళ్లబెట్టారు. ఇవేం గెటప్స్ బాబోయ్ అన్నట్లుగా చాలా మంది పెదవి విరిచారు.

ఆ తర్వాత సినిమా నుంచి తాజాగా ఒక పాట వచ్చింది. ఆ పాట సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో మరింత అసంతృప్తి కలిగేలా చేసింది. ఏ ఆర్‌ రహమాన్ సంగీతం తో వచ్చిన ఆ పాటలోని లిరిక్స్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. మ్యూజిక్‌ చాలా డామినేటింగ్ గా ఉండటంతో పాటు ఒక ఫక్త్‌ డబ్బింగ్‌ సినిమా పాట విన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సినిమా ప్రమోషన్స్‌ పూర్తి స్థాయిలో ప్రారంభం అవ్వకుండానే తమిళ్ బాహుబలి అంటూ ప్రచారం చేస్తున్న పొన్నియన్ సెల్వన్ ను తెలుగు ప్రేక్షకులు అబ్బే అంటూ పెదవి విరిచేస్తున్నారు. ముందు ముందు కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి ని కనబర్చే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో తెలుగు లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించాలంటే అద్భుతం ఆవిష్కారం అవ్వాల్సిందే. తెలుగు తో పాటు హిందీలో కూడా ఇదే పరిస్థితి ఉందా అనేది తెలియాల్సి ఉంది.