Begin typing your search above and press return to search.

40 ఏళ్ల డ్రీమ్‌.. మ‌హేష్‌, విజ‌య్ ఎందుకు కాద‌న్నారు?

By:  Tupaki Desk   |   13 July 2022 3:30 AM GMT
40 ఏళ్ల డ్రీమ్‌.. మ‌హేష్‌, విజ‌య్ ఎందుకు కాద‌న్నారు?
X
రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ ఫిక్ష‌న‌ల్ మూవీ 'బాహుబ‌లి'. అత్యంత సాహ‌సోపేతంగా రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం భార‌తీయ సినిమా రూప‌రేఖ‌ల్ని మార్చేసింది. భారీ బ‌డ్జెట్ సినిమాల‌ని తెర‌కెక్కించాల‌ని గ‌త కొన్నేళ్లుగా క‌ల‌లు కంటూ అవి మ‌న బ‌డ్జెట్ కి స‌రితూగ‌వ‌న్న అనుమానంతో ఇంత కాలం చాలా మంది మేక‌ర్స్ వెన‌క‌డుగు వేశారు. ఎప్పుడైతే రాజ‌మౌళి 'బాహుబ‌లి'తో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించాడో అప్పుడే ఇండియ‌న్ సినిమా సర‌కొత్త శ‌కానికి శ్రీ‌కారం చుట్టింది.

ప్రేక్ష‌కుల్ని మెప్పించి థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగే స‌త్తా వున్న క‌థ‌ల‌కు రాజ‌మౌళి చేసిన ప్ర‌యోగం కొండంత ధైర్యాన్నిచ్చింది. అదే 'కేజీఎఫ్‌' సీరీస్ కు బాట‌లు వేసింది. 'పుష్ప‌' రెండు భాగాలు గా తెర‌కెక్కించ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌ని, ధైర్యాన్ని అందించింది. ఇప్ప‌డు ఇదే ధైర్యంతో మ‌ణిర‌త్నం త‌ను గ‌త 40 ఏళ్లుగా కంటున్న క‌ల‌ని సాకారం చేసుకునేలా చేసింది. 'బాహుబ‌లి' స్ఫూర్తితో మ‌ణిర‌త్నం త‌న కల‌ల ప్రాజెక్ట్ గా భావించిన 'పొన్నియిన్ సెల్వం'ని తెర‌కెక్కిస్తున్నారు.

రెండు భాగాలు గా రూపొందుతున్న ఈ మూవీ తొలి భాగం సెప్టెంబ‌ర్ 30న పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల‌లో విడుద‌ల కాబోతోంది. 1958 నుంచి 'పొన్నియిన్ సెల్వ‌న్‌' ని తెర‌పైకి తీసుకురావాల‌ని ఎంతో మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. హీరోలు కూడా ప్ర‌య‌త్నించార‌ట‌. కానీ కుద‌ర‌లేదు. తొలి త‌రం హీరో ఎంజీఆర్ ఈ ప్రాజెక్ట్ ని తెర‌పైకి తీసుకురావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. ఆ త‌రువాత మ‌ణిర‌త్నం ఈ సినిమాని రూపొందించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నారు.

ర‌జ‌నీకాంత్ ,క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్ కాంత్ ల‌తో చేయాల‌నుకున్నార‌ట‌. కానీ కుద‌ర‌లేదు. ఇక నేటి త‌రం క్రేజీ స్టార్ లు విజ‌య్‌, మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో అనుకున్నారు. బ‌డ్జెట్ కార‌ణాల వ‌ల్ల ఇది వ‌ర్క‌వుట్ కాద‌ని తేల‌డంతో ఇన్వెస్ట‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గ‌త కొన్నేళ్లుగా నెర‌వేర‌డం లేదు.

గ‌త కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన మ‌ణిర‌త్నం 'ఓకే బంగారం', 2018లో వ‌చ్చిన 'న‌వాబ్‌' చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చారు. అప్ప‌టి నుంచి క‌ల్కీకృష్ణమూర్తి ఫేమ‌స్ న‌వ‌ల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వ‌న్‌' ని తెర‌పైకి తీసుకురావాల‌ని మ‌ణిర‌త్నం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. చాలా మంది ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల‌ని క‌లిశారు. కానీ ఎవ‌రూ ఇది వ‌ర్క‌వుట్ కాద‌ని చేతులు ఎత్తేయ‌డంతో చివ‌రికి లైకాని సంప్ర‌దించారు.

ఫైన‌ల్ గా లైకా నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌డంతో కొన్నేళ్లుగా తీర‌ని కోరిక‌గా మిగిలిపోయిన మ‌ణ‌ర‌త్నం క‌ల రెక్క‌లు తొడిగింది. విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్యా రాయ్‌, కార్తి, త్రిష కీల‌క పాత్ర‌ల్లో రెండు భాగాలుగా ఈ మూవీని ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్నారు. త‌మిళ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కాబోతోంది.