Begin typing your search above and press return to search.

ట్రెండ్‌: పొలిటిక‌ల్ డ్రామాల‌దే హ‌వా

By:  Tupaki Desk   |   23 April 2018 4:34 PM IST
ట్రెండ్‌: పొలిటిక‌ల్ డ్రామాల‌దే హ‌వా
X
తెలుగులో ఒక‌ప్పుడు పొలిటిక‌ల్ డ్రామా సినిమాలు పెద్ద‌గా ఆడేవి కావు. రానా హీరోగా ప‌రిచ‌య‌మైన ‘లీడ‌ర్‌’ సినిమా గానీ- కార్తీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ‘శ‌కుని’- జ‌గ‌ప‌తి బాబు ‘అధినేత‌’ సినిమాల రిజ‌ల్ట్ చూస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. వీటిలో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రైన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వ‌రుస‌గా రెండు పొలిటిక‌ల్ డ్రామా చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన ‘రంగ‌స్థ‌లం’ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. చిట్టిబాబు దెబ్బ‌కు నాన్‌- బాహుబ‌లి క‌లెక్ష‌న్ రికార్డుల‌న్నీ బ‌ద్ద‌ల‌య్యాయి కూడా. ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం ఓ ఊరి రాజ‌కీయాల చుట్టూనే తిరిగింది. ప్రెసిడెంటు చేసే అన్యాయాల‌పై తిర‌గ‌బ‌డ్డ అన్న‌... అత‌నికి అండ‌గా నిలిచిన త‌మ్ముడి క‌థే రంగస్థ‌లం. ఈ ప‌ల్లెటూరి ప్రాంతీయ రాజ‌కీయాల‌కు బాక్సాఫీస్ మారుమోగిపోయింది. ఆ త‌ర్వాత 20 రోజుల‌కు ‘భ‌ర‌త్ అనే నేను’ అంటూ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వ‌చ్చాడు. మెగా ప‌వ‌ర్ స్టార్ ఒక్క ఊరి రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మైతే... సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఏకంగా స్టేట్ పాలిటిక్స్ ను రుచి చూపించాడు. రాజ‌కీయాల‌కు రుచి మ‌రిగిన ప్రేక్ష‌కుల‌కు ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ చ‌ర్య‌లు బాగా న‌చ్చేశాయి. అందుకే బాక్సాఫీస్ భ‌ర‌తం ప‌డుతూ దూసుకుపోతున్నాడు మ‌హేష్‌.

వ‌చ్చేనెల మొద‌ట్లో విడుద‌ల కాబోతున్న అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య‌’ సినిమాలోనూ రాజ‌కీయ కోణం చూపించ‌బోతున్నాడ‌ట ద‌ర్శ‌కుడిగా మారిన ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ. ఈ సినిమాలో అల్లుఅర్జున్ మిల‌ట‌రీ మ్యాన్ గా క‌నిపిస్తున్నాడు కాబ‌ట్టి దేశ రాజ‌కీయాల‌పైనే ఫోక‌స్ పెట్టే అవ‌కాశం ఉంది. అదే గ‌నుక నిజ‌మైతే చ‌ర‌ణ్ ఊరి పాలిటిక్స్ ను... మ‌హేష్ స్టేట్ రాజ‌కీయాల‌ను... సూర్య ఏకంగా దేశ కేంద్ర రాజ‌కీయాల‌ను చూపించిన వాడ‌వుతాడు. మ‌రి ‘నా పేరు సూర్య‌’ ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా కూడా ముందొచ్చిన ఇద్దరి బాట‌లోనే రికార్డుల వేట కొన‌సాగిస్తే మాత్రం... భ‌విష్య‌త్తులో రాజ‌కీయాల‌ను బేస్ చేసుకుని రూపొందే పొలిటిక‌ల్ మూవీస్ పెరిగిపోవ‌డం ఖాయం.