Begin typing your search above and press return to search.

సంజన డ్రగ్స్ కేసు: చిక్కుల్లో ఐఏఎస్ ఆఫీసర్?

By:  Tupaki Desk   |   14 Sep 2020 5:37 PM GMT
సంజన డ్రగ్స్ కేసు: చిక్కుల్లో ఐఏఎస్ ఆఫీసర్?
X
కర్ణాటకలో డ్రగ్స్ దందా కన్నడ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ ఇప్పటికే అరెస్ట్ అయ్యి విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా వారు ఈ దందాలో భాగస్వాములైన సినీ , రాజకీయ , అధికార ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు కర్ణాటక పోలీసులు - మాదకద్రవ్యాల నియంత్రణ మండలి సీల్డ్ కవర్ లో నివేదికను ఒకటి రెండు రోజుల్లో కోర్టులో దాఖలు చేస్తారని తెలుస్తోంది. సంజన ఇప్పటికే ఈ మేరకు నిజాలు వెల్లడించిందని.. పోలీసులు ఇతర కోణాల్లో కూడా డ్రగ్స్ తో ప్రమేయం ఉన్న వారిని కనుగొన్నట్టు సమాచారం. దీంతో చాలా మంది ఈ కేసుతో అనుబంధం ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

డ్రగ్స్ కేసులో నటి రాగిణి ద్వివేది అరెస్టు అయిన తర్వాత ఈ కేసుతో సంబంధమున్న సంజన ఓ ఐఎఎస్ అధికారికి పలుసార్లు కాల్స్ చేసినట్లు కన్నడ మీడియా తెలిపింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, తనను రక్షించమని సంజన అధికారిని కోరినట్లు సమాచారం.. నటి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె ఒక ఐఎఎస్ అధికారి తో మాట్లాడినట్టు కనుగొన్నారు.

కన్నడ మీడియా కథనం ప్రకారం.. సంజన కేవలం మాదకద్రవ్యాలకు పాల్పడడమే కాదు.. మనీలాండరింగ్ మరియు ఇతర హవాలా కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించినట్టు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కార్యకలాపాలకు సంబంధించి ఆ ఐఏఎస్ అధికారి పాత్ర అందులో ఉందని పోలీసులు కనుగొన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇప్పటికే అరెస్టయిన డ్రగ్ కింగ్‌పిన్ రాహుల్ శెట్టి మరియు తప్పించుకున్న నియాజ్ అహ్మద్‌తో సంజన వాట్సాప్ చాట్లు డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో ఈ కేసులో సంజనకు ఉచ్చు బిగుసుకున్నట్లు చెబుతున్నారు.

అయితే, సంజన, రాగిణి ద్వివేది ఇద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి పిటిషన్లను మంగళవారం కోర్టు విచారించనుంది.