Begin typing your search above and press return to search.

శింబు కోసం వేటాడుతున్నారు

By:  Tupaki Desk   |   16 Dec 2015 11:47 AM IST
శింబు కోసం వేటాడుతున్నారు
X
పెద్ద క్రిమినల్ కోసం వేట సాగిస్తున్న తరహాలో తమిళ హీరో శింబు కోసం గాలిస్తున్నారు తమిళనాడు పోలీసులు. వారికి చిక్కకుండా శింబు అజ్నాతంలోకి వెళ్లిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మహిళలను అగౌరవ పరిచేలా అసభ్య పదజాలాలతో కూడిన పాటను రాసి, పాడి దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడన్నది శింబు మీద ఉన్న ఆరోపణ. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఈ గొడవలో చిక్కుకున్నాడు. వీళ్లిద్దరి ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న ఆ బీప్ సాంగ్ విషయంలో మహిళా సంఘాలు మంటెత్తిపోతున్నాయి.

మహిళా సంఘాల నేతలు చాలా తీవ్రంగా స్పందిస్తుండటం.. కోవై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు శింబు - అనిరుధ్ లపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి రెండు రోజుల క్రితమే చెన్నై వచ్చారు. ఐతే శింబు అజ్ఞాతంలోకి వెళ్లడం.. అనిరుధ్ కెనడాలో ఉండడంతో వారి ఇళ్లకు సమన్లు అంటించారు. శింబును అరెస్ట్ చేసే తిరిగి రావాలని పోలీస్ కమిషనర్ గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో కోవై రేస్ కోర్స్ పోలీసులు చెన్నైలోనే మకాం వేసి శింబు ఆచూకీ కోసం నగరంలో గాలిస్తున్నారు.

మరోవైపు మహిళా సంఘాల నేతలు శింబు ఇంటిని చుట్టు ముట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన గొడవలో సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. మహిళల్ని కించపరచే విధంగా అశ్లీల పదజాలాలతో కూడిన పాటను రాసిన వారెవరైనా వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని ఆయన ట్వీట్ చేయడం విశేషం. మంగళవారం కెనడా నుంచి చెన్నైకి తిరిగి రానున్న అనిరుధ్ ను పోలీసులు ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేయడానికి కాచుకుని ఉన్నారు. శింబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.