Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్ భారీ ఈవెంట్‌ కు టీ పోలీసుల 'నో..'

By:  Tupaki Desk   |   30 March 2021 10:45 PM IST
వకీల్‌ సాబ్ భారీ ఈవెంట్‌ కు టీ పోలీసుల నో..
X
పవన్ అభిమానులతో పాటు సినీ వర్గాల వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'వకీల్‌ సాబ్‌' సినిమా ఏప్రిల్‌ 9న విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్‌ 3వ తారీకున యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్స్ లో నిర్వహించాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. అందుకోసం పోలీసులను అనుమతులు కూడా అడగడం జరిగింది. పోలీసుల నుండి ఖచ్చితంగా అనుమతులు వస్తాయనే ఉద్దేశ్యంతో ఏర్పాట్లు కూడా షురూ చేశాడు. ఈ వేడుకకు కోటి రూపాయలు.. కాదు రెండు కోట్లు అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్ వేడుక కు అనుమతులు ఇవ్వలేం అంటూ తెలంగాణ పోలీసులు నిర్మాత దిల్‌ రాజుకు షాక్ ఇచ్చారు.

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో పబ్లిక్ ఈవెంట్‌ లు తగ్గించుకుంటే మంచిది అంటూ ఇటీవలే అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. అందులో భాగంగానే వకీల్‌ సాబ్ నిర్మాతలు అడిగిన పర్మీషన్ ను ఇవ్వలేం అంటూ పోలీసులు పేర్కొన్నారు. ఈవెంట్‌ కు అయిదు నుండి ఆరు వేల మంది హాజరు అయ్యే అవకాశం ఉంటుంది. కనుక వారిలో సామాజిక దూరం సాధ్యం కాదని పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 30వ తారీకు వరకు పబ్లిక్ ఈవెంట్స్ పై నిషేదం విధించినట్లుగా కూడా పోలీసులు పేర్కొన్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వకీల్ సాబ్‌ ప్రీ రిలీజ్ వేడుక కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని పోలీసులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దిల్‌ రాజు తక్కువ గేదరింగ్‌ తో ఈవెంట్‌ కు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ మరో సారి టీ పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సమయంలో పబ్లిక్‌ గేదరింగ్‌ కూడా మంచిది కాదని పవన్‌ ఈవెంట్ కు నో చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వకీల్‌ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.