Begin typing your search above and press return to search.

తేజ్ నడిపిన బైక్ ఎవరిది? దాని వెనుకున్న కథేంటి?

By:  Tupaki Desk   |   12 Sep 2021 3:35 AM GMT
తేజ్ నడిపిన బైక్ ఎవరిది? దాని వెనుకున్న కథేంటి?
X
రోడ్డు ప్రమాదానికి గురైన వేళలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఖరీదైన ఒక విదేశీ బైక్ (ట్రయంఫ్)ను నడిపిన సంగతి తెలిసిందే. దీని విలువ దాదాపు రూ.18లక్షలు ఉంటుందని చెబుతున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జిని దాటి.. ఐకియా రోడ్డులోకి వెళ్లే వేళలో.. అతను ప్రయాణిస్తున్న బైక్.. రోడ్డు మీద ఉన్న ఇసుక మేట కారణంగా స్కిడ్ కావటం..ప్రమాదానికి కారణంగా చెప్పక తప్పదు. అయితే.. అతి వేగం (గంటకు 100కి.మీ పైనే) ప్రమాదానికి కారణమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ప్రమాదానికి కారణం ఏమిటన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పోలీసులు చెబుతున్నట్లుగా గంటకు వంద కిలోమీటర్లపైనే స్పీడ్ తో నడిపినందు వల్లే ప్రమాదం జరిగిందనే అనుకుంటే.. రోడ్డు మీద ఇసుక మేట లేకపోతే.. ప్రమాదం జరిగేదా? అన్నది ప్రశ్న. అసలు.. ఒక ఫారిన్ బైక్ అది కూడా దాదాపు 1100 సీసీ సామర్థ్యం ఉన్న వాహనం గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళితే.. స్కిడ్ అవుతుందా? అన్నది మరో ప్రశ్న.

ఇవాల్టి రోజున సాదాసీదా వాహనాలే గంటకు 80కి.మీ వేగంతో దూసుకెళ్లే వాళ్లు హైదరాబాద్ రోడ్ల మీద చాలామందే కనిపిస్తారు. దీనికి తోడు.. వాహన రద్దీ పెద్దగా లేని రోడ్డు మీద ప్రమాదకరంగా కాకుండా.. వేగంగా వెళ్లటం కూడా చట్ట ప్రకారం తప్పే అవుతుందా? అన్నది మరో ప్రశ్న. రోడ్డు ఖాళీగా ఉన్నా.. వేగ పరిమితికి సంబంధించిన బోర్డుల్లో సూచించిన వేగానికి మించి ప్రయాణించటం నేరమే అవుతుందంటే.. ఈ రోజున హైదరాబాద్ మహానగరంలో వాహనాలు నడిపే వారంతా కూడా నేరాలు చేస్తున్నట్లే. ఇక్కడ మేం సాయి ధరమ్ తేజ్ ను సమర్థించటం లేదు. ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయాల్ని ప్రస్తావించటమే లక్ష్యం.

సాయిధరమ్ తేజ్ ఎపిసోడ్ ను చూసినప్పుడు అతడు వేగంగా వెళుతున్నది వాస్తవం. రూల్ బుక్ లో పేర్కొన్నట్లుగా కాకుండా.. పరిమితులు విధించిన చోట.. దానికి మించిన వేగంతో వెళుతున్న వైనాన్ని సమర్థించటం లేదు. కానీ.. రోడ్డు మీద ఉన్న ఇసుక మేట మాటేంటి? ఆ మాటకు వస్తే తేజ్ మాత్రమే కాదు.. రోజు వేలాది మంది మహానగరంలోని వేలాది కిలోమీటర్లు విస్తరించిన చాలా రోడ్లలో ప్రమాదాల బారిన పడుతున్నారు. వారందరి అనుభవాలు తాజా ఉదంతంతో చర్చకు వచ్చాయన్నది మర్చిపోకూడదు.

ఇదిలా ఉంటే.. తేజ్ నడుపుతున్న బైక్ ఎవరిది? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఆ బండి రిజిస్ట్రేషన్ ప్రకారం చూస్తే.. బుర్రా అనిల్ కుమార్ అని ఉంది. మరోవైపు.. ఆ బైక్ సినీ నటుడు నరేశ్ కొడుకుదిగా చెబుతారు. అదే నిజమైతే.. అతని పేరు మీద కాకుండా బుర్రా అనిల్ పేరుతో ఎందుకు ఉంది? అన్నది మరో ప్రశ్న. దీనికి సైబరాబాద్ పోలీసులు సమాధానం ఇచ్చారు. ఎల్బీనగర్ లోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన బుర్రా అనిల్ కుమార్ వద్ద సాయిధరమ్ ఈ బైక్ ను కొనుగోలు చేశారు. అయితే.. దాన్ని తన పేరు మీద ఇంకా ట్రాన్సఫర్ చేయించుకోలేదు. ఈ కారణంతోనే.. బైక్ సాయి ధరమ్ తేజ్ పేరు మీద కాకుండా.. వేరే వారి పేరు మీద ఉందన్నది స్పష్టమైంది.