Begin typing your search above and press return to search.

వర్మపై కేసు పెట్టేలా చేసిన ‘సన్నీలియోన్’

By:  Tupaki Desk   |   9 March 2017 11:18 AM IST
వర్మపై కేసు పెట్టేలా చేసిన ‘సన్నీలియోన్’
X
మనసుకు ఏం అనిపిస్తే అది చెప్పేయటం తప్పేం కాదు. కానీ.. మనసుకు అనిపించే విషయాలు బయటకు చెప్పటం ద్వారా.. అవతలవారి మనోభావాలు దెబ్బ తినేలా ఉండకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ పాయింట్ ను మిస్ అవుతారు. తనకేం అనిపిస్తే ఆ మాటను అనేస్తారు. తనను తాను తిట్టుకుంటానని గొప్పగా చెప్పే ఆయన.. తన చుట్టూ ఉన్న వారిపై ఎంతలేసి మాటలంటే.. అంతలేసి మాటలు అనేస్తుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలు ట్వీట్లు చేసిన వర్మ.. పనిలో పనిగా.. మహిళలు సన్నిలియోన్ మాదిరి సుఖపెట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యను ట్విట్ రూపంలో చేశారు.

సన్నిలియోన్ గతంలో పోర్న్ స్టార్ గా నటించిన నేపథ్యాన్ని మర్చిపోకూడదు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె పలు పాత్రలు పోషించినా.. ఆమెకున్న అడల్ట్ స్టార్ ఇమేజ్ మాత్రం పోకపోవటాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి వేళ.. మహిళలంతా సన్నీలా వ్యవహరించాలని కోరటం ద్వారా చాలామందిని హర్ట్ అయ్యేలా చేశారు వర్మ.

ఇలాంటి వివాదాలు వర్మకు కొత్తేం కాదు. కానీ.. గతంతో పోలిస్తే.. తాజా వ్యాఖ్యలు ఘాటుగా ఉండటం.. తప్పుపట్టేలా ఉండటం గమనార్హం. వర్మ చేసిన అనుచిత ట్వీట్ పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. మహిళల్నికించపరిచేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సన్ని పేరుతో వర్మ చేసిన వ్యాఖ్యలపై సామాజిక ఉద్యమకర్త విశాఖ మాంబ్రే గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చౌకబారు ఇమేజ్ కోసమే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఆయన ట్విట్టర్ అకౌంట్ ను శాశ్వితంగా బ్లాక్ చేయాలన్నసరికొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. విశాఖ మాంబ్రే ఫిర్యాదుతో వర్మపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/