Begin typing your search above and press return to search.

పోకిరి రీరిలీజ్.. ఇదో కొత్త ట్రెండ్ అవుతుందా?

By:  Tupaki Desk   |   19 July 2022 5:34 AM GMT
పోకిరి రీరిలీజ్.. ఇదో కొత్త ట్రెండ్ అవుతుందా?
X
మ‌హేష్ `పోకిరి` విడుద‌లై దాదాపు ప‌ద‌హారేళ్లు పూర్త‌యింది. అయినా ఇప్ప‌టికీ ఈ మూవీ బుల్లితెర టీఆర్పీల్లో వెన‌క‌బ‌డ‌లేదు. ఎన్నిసార్లు టీవీల్లో వేసినా యూనిక్ నెస్ తో ఆక‌ట్టుకునే సినిమా ఇది. అయితే ఈ సినిమాని నేటి అధునాత‌న డిజిట‌ల్ సాంకేతిక‌త‌ను జోడించి రీరిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? .. ఇదే ఆలోచ‌న మేక‌ర్స్ కి వ‌చ్చింది. ఇప్పుడు ఈ మూవీని 4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్బీ ఆడియోతో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీమియ‌ర్లు వేయ‌నున్నార‌ని తెలిసింది. ప్ర‌తిసారీ త‌న పుట్టినరోజున ఫ్యాన్స్ కి ఏదో ఒక కొత్త విష‌యం అందించే మ‌హేష్ ఈసారి స్పెష‌ల్ గిఫ్ట్ ని ప్లాన్ చేసార‌ని కూడా దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

డిజిట‌ల్ మాస్ట‌రింగ్ అయ్యాక పోకిరిని భారీ ప్రీమియ‌ర్లుగా రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. గ‌తంలో బిజినెస్ మెన్- శ్రీమంతుడు లాంటి సినిమాల్ని రీరిలీజ్ చేయ‌గా అభిమానులు ఎంతో ఖుషీ అయ్యారు. పోకిరితో మ‌రోసారి అలాంటి మ్యాజిక్ రిపీట్ కానుంది.

మ‌హేష్ కెరీర్ లోనే పోకిరి రికార్డ్ బ్రేకింగ్ హిట్. ప్రిన్స్ మ‌హేష్ ని సూప‌ర్ స్టార్ ని చేసిన చిత్ర‌మిది. 16 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. దాదాపు 12కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం అప్ప‌ట్లోనే 40 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌డం ఇండ‌స్ట్రీ రికార్డ్. 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ వైష్టో అకాడమీ బ్యానర్ తో పాటు మంజుల తన ఇందిరా ప్రొడక్షన్స్‌లో సంయుక్తంగా తెరకెక్కించారు.

పోకిరి చిత్రంతో మ‌హేష్ .. ఇలియానా లాంటి స్టార్ల రేంజే మారిపోయింది. ముఖ్యంగా మ‌హేష్ ని రొటీన్ పాత్ర‌ల‌ నుంచి బ‌య‌ట‌ప‌డేసిన చిత్ర‌మిది. ఈ మూవీకి పూరి రాసిన‌ డైలాగులు ఎప్ప‌టికీ ఇండ‌స్ట్రీ ట్రెండ్ సెట్ట‌ర్స్. ఇలియానా అంద‌చందాలు.. బ్రహ్మానందం కామెడీ.. యాక్షన్ సీక్వెన్స్ హైలైట్స్ గా నిలిచి స‌క్సెస్ లో కీల‌క భూమిక‌ను పోషించాయి.

299 కేంద్రాల్లో 50 రోజులు .. 63 కేంద్రాల్లో 175 రోజులు నడిచి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన చిత్రంగా పోకిరి రికార్డుల‌కెక్కింది. పోకిరి ప‌లు భాష‌ల్లోకి రీమేకై అక్క‌డా సంచ‌ల‌నాలు సృష్టించింది. సినిమా తమిళంలో 2007లో విజయ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో పోక్కిరి అన్న పేరుతో రీమేక్ చేశారు. హిందీలో వాంటెడ్ అనే టైటిల్ తో ప్రభుదేవానే దర్శకునిగా సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మించారు. కన్నడంలో దర్శన్ హీరోగా పోర్కి అన్న పేరుతోనూ.. బెంగాలీలో షకీబ్ ఖాన్ హీరోగా రాజోట్టో పేరిట రీమేక్ చేశారు. ఇవన్నీ సంచలన విజయాలు సాధించాయి.

ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ ని ఇప్ప‌టికీ అభిమానులు మ‌ర్చిపోలేదు.``ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండు బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు.``.. ``నేనెంత ఎదవనో నాకే తెలియదు``.. ``ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను`` లాంటి డైలాగ్ లు ఎవ్వ‌ర్ గ్రీన్ డైలాగ్స్ జాబితాలో నిలిచాయి.